చిత్తూరుహోమ్

సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

#BRNaidu

టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగాల సమన్వయం, అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను వివరించారు.

అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామని చెప్పారు. గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవను వీక్షించారని, వారికి అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామని తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు

అక్టోబరు 12 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది రోజుల్లో: 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం.

రూ.25.79 కోట్ల హుండీ కానుకలు.

22.60 లక్షల అన్నప్రసాదాల పంపిణీ.

2.44 లక్షల మంది భక్తుల తలనీలాల సమర్పణ.

34.34 లక్షల లడ్డూల విక్రయం.

గరుడసేవ రోజున  చైర్మన్ తో కలసి పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

సాంస్కృతిక, పుష్ప, విద్యుత్ అలంకరణలతో ఆధ్యాత్మిక వైభవం

వాహనసేవలకు ముందు 26 రాష్ట్రాలు మరియు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 17 రాష్ట్రాల నుంచి 31 కళాబృందాలకు చెందిన 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టాం. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉంచాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాం.

రవాణా, వైద్య, భద్రతా ఏర్పాట్లు

ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,608 ట్రిప్పుల్లో 4.01 లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,667 ట్రిప్పుల్లో 5 లక్షల మంది ప్రయాణించారు. తిరుమలలో 39 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, గత పది రోజుల్లో 6,900 ట్రిప్పుల ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు స్థానిక రవాణా సౌకర్యం కల్పించాం.

భక్తులకు సేవలందించేందుకు 4,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. వైద్య సేవల కోసం 85 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 20 అంబులెన్సులు, నాలుగు మొబైల్ క్లినిక్‌లను అందుబాటులో ఉంచాం.

బ్రహ్మోత్సవాల్లో 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించగా, గరుడసేవ రోజున అదనంగా 1,000 మంది పోలీసులను ఏర్పాటు చేశాం . ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం.

పారిశుద్ధ్యం, భక్తుల భద్రతకు ప్రాధాన్యం

గరుడసేవ రోజున 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. సేకరించిన సుమారు 183 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు.

సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అర్చక స్వాములు, పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులకు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు సదాశివరావు, నరేష్ కుమార్, దర్శన్, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

జగన్ పీఆర్వోకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Satyam News

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

Satyam News

సికా లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమం

Satyam News

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

Satyam News

Leave a Comment