విద్యార్ధుల నుంచి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసి ఆ తర్వాత స్టడీ సెంటర్లను మూసివేసి విద్యార్ధులను మోసం చేయడమే కాకుండా వసూలు చేసిన ఫీజులను అక్రమ మార్గాల ద్వారా మళ్లించారనే అభియోగంతో ప్రముఖ విద్యాసంస్థ ఫిట్జీ లిమిటెడ్ (FIITJEE), ఆ సంస్థ డైరెక్టర్లు దినేశ్ కుమార్ గోయల్, మోనిలా గోయల్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది.
జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఫిట్జీ సంస్థ రెండు నుంచి నాలుగు సంవత్సరాల పాటు కొనసాగే కోచింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.2.8 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ముందస్తుగా ఫీజులు తీసుకున్నట్లు తెలిపింది. నిర్ణీత వ్యవధిలో పూర్తి స్థాయి శిక్షణ అందిస్తామని, కోర్సు మొత్తం నిర్వహిస్తామని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చినట్లు ఆరోపించింది.
ఫీజులు చెల్లించిన విద్యార్థులకు హామీ ఇచ్చిన విధంగా శిక్షణ అందకపోవడం ఈ వ్యవహారంలో ప్రధాన అంశంగా మారింది. సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు ఉద్యోగాలను విడిచిపెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీంతో కొన్ని కోచింగ్ కేంద్రాల్లో బోధనా సిబ్బంది కొరత ఏర్పడటంతో పాటు, కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేసినట్లు పేర్కొంది. కేంద్రాలను మూసివేసే ముందు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని, ముందస్తుగా ఫీజులు చెల్లించినప్పటికీ కోర్సులను పూర్తి చేసే అవకాశం లేకుండా పోయిందని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. లక్షల రూపాయలు చెల్లించి ప్రవేశం పొందిన విద్యార్థులు కోచింగ్ మధ్యలోనే నిలిచిపోవడంతో వారి పోటీ పరీక్షల సన్నద్ధతపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జేఈఈ వంటి పరీక్షలకు దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ కేంద్రాలు అకస్మాత్తుగా మూతపడటం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది.
2024 మే నుంచి 2025 ఫిబ్రవరి మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో ఫిట్జీకి చెందిన 32 కోచింగ్ కేంద్రాలు అకస్మాత్తుగా మూతపడ్డాయి. దీంతో ముందుగానే ఫీజులు చెల్లించిన 14,411 మంది విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అంతేకాకుండా, 2029 మార్చి వరకు కొనసాగాల్సిన కోర్సులకు కూడా విద్యార్థుల నుంచి ప్రవేశాలు, ఫీజుల వసూళ్లు కొనసాగించినట్లు సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.
రూ.85.79 కోట్ల మనీలాండరింగ్
వసూలు చేసిన సుమారు రూ.85.79 కోట్లను చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఈడీ పేర్కొంది. ఫిట్జీ డైరెక్టర్లు దినేశ్ కుమార్ గోయల్, మోనిలా గోయల్ వేతనాల అంశాన్ని కూడా ఈడీ ప్రస్తావించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఇద్దరూ కలిపి రూ.24.92 కోట్ల మేర వేతనాలు పొందినట్లు ఆరోపించింది. ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైనా, చెల్లింపులు నిలిచిపోయినా డైరెక్టర్లకు భారీ మొత్తాల్లో వేతనాలు చెల్లించుకున్నారని పేర్కొంది.
ఈడీ లక్నో జోనల్ కార్యాలయం 2026 అక్టోబర్ 15న ఘజియాబాద్లోని ప్రత్యేక నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) న్యాయస్థానంలో ఫిట్జీ లిమిటెడ్, దాని డైరెక్టర్లు దినేశ్ కుమార్ గోయల్, మోనిలా గోయల్లపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్షించాలని, దర్యాప్తులో జప్తు చేసిన లేదా తాత్కాలికంగా జప్తు చేసిన రూ.71.88 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ కేసు నోయిడా, గ్రేటర్ నోయిడా, భోపాల్ ప్రాంతాల్లో నమోదైన పోలీసు కేసుల ఆధారంగా సాగిన దర్యాప్తుతో ముడిపడి ఉంది.
