వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా ఉంది. సొంత మీడియాలో పార్టీకి, అధినేతకు ఒక రేంజ్లో ఎలివేషన్లు వేసుకొంటూ.. ప్రత్యర్ధులపై నచ్చిన కథలు, కథనాలు ప్రచారం చేస్తూ అంతా బాగానే ఉంది.. వైసీపీకి తిరుగు లేదు.. జగన్‌కి ఎదురు లేదని కలరింగ్ ఇస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ ఎంత కవర్ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మార్చలేకపోతున్నారు.
గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ప్రజాదరణ లేదని.. స్థానిక నాయకులకు స్పష్టమైన అవగాహన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీలో ఉన్న నిరాశ నిస్పృహలను వెలుగులోకి తీసుకొచ్చాయి. గతంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా.. టికెట్ల కోసం అభ్యర్ధులు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు మాత్రం.. పార్టీ అధిష్టానం అభ్యర్ధుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. స్వయంగా జగన్ రంగంలోకి దిగి.. ప్రతి చోటా పోటీ చేసి తీరాలని హెచ్చరికలు జారీ చేసినా.. మున్సిపల్ ఎన్నికల్లో చాలా ఏకగ్రీవాలు జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత.. మంగళగిరి, సర్వేపల్లి, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో వందల మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ వ్యూహాలు పనిచేయకపోవడం.. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం.. వంటి కారణాలతోనే కీలక సమయంలో వైసీపీ నాయకులు కాడి కింద పడేసి ఎవరి దారి వాళ్లు చూసుకొంటున్నారు.
ఎంత సేపు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని.. వ్యక్తిగత విమర్శలు చేయడానికే పరిమితం కావడం వైసీపీ చేస్తున్న అతి పెద్ద తప్పు. కూటమి పాలనపై ఎలాంటి ఆరోపణ చేసినా.. గతం వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకంటే దారుణాలు జరిగాయనో, అసలేమీ చేయలేదనే కౌంటర్లకు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సమాధానం లేదు. అభివృద్ధిని అడ్డుకొనే ఎజెండా.. పొరపాటున మళ్లీ గెలిస్తే ప్రత్యర్ధులను వెంటాడి వేటాడతాం అనే ఫ్యాక్షన్ డైలాగులు సెల్ఫ్ గోల్స్ అవుతున్నాయి. ఇలాంటి కామెంట్స్‌తో కొంతమంది వీరాభిమానులను సంతృప్తి పరిచినా.. మెజారిటీ ప్రజలను దూరం చేసుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు కదిలిపోయాయి అనే స్పష్టత రావడంతో.. క్యాడర్ సైలెంట్‌గా సైడ్ అయిపోతోంది. సొంత మీడియాలో చేసుకొంటున్న ప్రచారాలు ఈ వలసలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత వలసలు మరింత ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
