హైదరాబాద్హోమ్

హైదరాబాద్ వేదిక గా అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు

#Maiz

తొలి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు–2026 (IMC-2026)కు హైదరాబాద్ వేదిక కానుంది. నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఆహారం, పశువుల దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిర అభివృద్ధికి మొక్కజొన్న విప్లవం అనే ఇతివృత్తంతో సదస్సును నిర్వహిస్తున్నారు.

సదస్సుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్–నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ మీడియాతో మాట్లాడి సదస్సు లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రత, పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలు, పునరుత్పాదక ఇంధనం, సుస్థిర వ్యవసాయంలో మొక్కజొన్న కీలక పాత్ర పోషిస్తోందని డాక్టర్ ఎం.ఎల్. జాట్ పేర్కొన్నారు. మొక్కజొన్న సాగులో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు పరిశోధనలను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

500 మందికి పైగా ప్రతినిధుల హాజరు

మొక్కజొన్న సాంకేతిక నిపుణుల సంఘం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ , అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమల అభివృద్ధి కేంద్రం, ఐసీఏఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి 500 మందికి పైగా శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, అభివృద్ధి సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

55 మిలియన్ టన్నులు దాటిన మొక్కజొన్న ఉత్పత్తి

భారత్‌లో మొక్కజొన్న ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని డాక్టర్ ఎం.ఎల్. జాట్ తెలిపారు. 1950–51లో 20 లక్షల టన్నుల కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తి 2025–26 నాటికి 5.5 కోట్ల టన్నులు దాటిందని వెల్లడించారు.

వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు, ఆధునిక విత్తనాభివృద్ధి సాంకేతికతలు, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు , యాంత్రీకరణ, స్మార్ట్ ఫార్మింగ్, సుస్థిర సాగు పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై సదస్సులో చర్చించనున్నారు.

ఆధునిక సాంకేతికతల ప్రదర్శన

సదస్సులో ప్లీనరీ ఉపన్యాసాలు, సాంకేతిక సమావేశాలు, ప్యానెల్ చర్చలు, పోస్టర్ ప్రదర్శనలు, పరిశ్రమలతో సమావేశాలు, విధానపరమైన చర్చలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మొక్కజొన్న ఆవిష్కరణలు, పరిశ్రమల ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన విత్తన రకాలు, డిజిటల్ వ్యవసాయ పరిష్కారాలు, బయో ఎనర్జీ అవకాశాలు, మొక్కజొన్న ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.

వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత ప్రత్యేక ఆకర్షణ

మొక్కజొన్న పరిశోధన, వంగడాల అభివృద్ధిలో విశేష కృషి చేసిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డాక్టర్ ఎస్.కె. వాసల్ ఈ సదస్సులో పాల్గొననున్నారు. భారతదేశంలో మొక్కజొన్న రంగం అభివృద్ధి ప్రయాణం, ప్రముఖ శాస్త్రవేత్తల సేవలను వివరించే కీలక ప్రచురణలను కూడా ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. మొక్కజొన్న రంగాన్ని మరింత ఉత్పాదకంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.

కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఐసీఏఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ నాచికేత్ కోత్వాలీవాలే, సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్, జోధ్‌పూర్‌లోని ఐసీఏఆర్–సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. జాట్, పీజేటీఏయూ పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ బలరాం మరాఠీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక అరెస్టు

Satyam News

భక్తి పారవశ్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం

Satyam News

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Satyam News

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

అజిత్ పవార్ తో ముగిసిన ఆ ఇద్దరి కథ….

Satyam News

Leave a Comment