మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌జెట్ విమానం బారామతి సమీపంలో కూలిపోయిన సంఘటన అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో బాటు మొత్తం 5 మంది మరణించారు: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కో-పైలట్ శాంభవి పాటాక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్ సుమిట్ కపూర్, వ్యక్తిగత భద్రత అధికారి విదీప్ జాధవ్. వీరిలో వెలుగులోకి రాని ఇద్దరి గురించి కొన్ని వివరాలను సత్యంన్యూస్ మీ ముందు ఉంచుతున్నది.
25 ఏళ్ల శాంభవి పాటాక్ ఆ Learjet 45 విమానంలోని కో-పైలట్ (సహ-పైలట్) గా సేవలు అందిస్తుండగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు వైమానిక రంగంలో మంచి శిక్షణ, అభిరుచి ఉండేది. ప్రయాణానికి ముందుగానే ఆమె తన అమ్మమ్మగారికి “గుడ్ మార్నింగ్” అని సందేశం పంపింది.
ఆ సందేశం ఆమె చివరి మాటగా నిలిచింది. శాంభవి పాటాక్ గ్వాలియార్ (మధ్యప్రదేశ్) లో జన్మించింది. ఆమె చిన్నప్పటి చదువును ఎయిర్ ఫోర్స్ విద్యా భారతీ స్కూల్ లో పూర్తిచేసి వాణిజ్య పైలట్‌గా శిక్షణ పొందింది. న్యూజిలాండ్ లోని ఒక అంతర్జాతీయ పైలట్ శిక్షణ సంస్థలో ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేశారు. ప్రమాదం వార్తను తెల్సుకున్న తరువాత ఆమె కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
29 ఏళ్ల పింకీ మాలి ఈ ప్రమాదంలో మరణించిన ఫ్లైట్ అటెండెంట్. ఆమె ముంబయిలోని వర్లీ-ప్రభాదేవి ప్రాంతంలో నివసించేది. ఆమె ఏవియేషన్ రంగంలో చాలా కాలంగా పని చేస్తున్నది. ఎన్‌సీపీ కార్యకర్త అయిన తండ్రి శివకుమార్ మాలి కుమార్తె ఆమె.
ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాకు చెందిన పింకీ మాలి, ముంబైలో నివసిస్తూ ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేస్తోంది. అనేక వీఐపీ ప్రయాణాల్లో సేవలు అందించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రమాదానికి ముందు తన తండ్రితో మాట్లాడిన పింకీ, “నాన్నా, నేను అజిత్ దాదాతో ప్రయాణిస్తున్నాను” అని చెప్పిన మాటలే ఆమె చివరి సంభాషణగా మిగిలాయి.
గ్రామంలోనూ, కుటుంబంలోనూ సేవాభావం కలిగిన యువతిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె అకాల మరణంతో స్వగ్రామం శోకసంద్రంలో మునిగింది. యువ వయసులోనే ప్రాణాలు కోల్పోయిన శాంభవి పాటాక్, పింకీ మాలి మరణాలు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని కలిగించాయి. వారి కుటుంబాలకు రాజకీయ, సామాజిక వర్గాల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది.
