వాళ్లను ఎవరూ బొట్టు పెట్టి పిలవరు… అయినా పిలవని పేరంటానికి వచ్చే పెద్ద ముత్తైదువుల్లా సినిమా ఫంక్షన్లకు, ప్రెస్మీట్లకు వచ్చి ముందు వరుసలో కూర్చుంటారు. ప్రెస్మీట్లలో హీరోలు, హీరోయిన్లను సినిమా కథకు, ప్రచారానికి ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందిపెడుతూ, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి అనవసరమైన చర్చలు లేవనెత్తుతారు.
ఎవరికివారు సొంతంగా ఓ వెబ్సైట్ లేదా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించుకుని, చేతిలో ఓ మైక్ పట్టుకుని సీనియర్ జర్నలిస్టుల మాదిరిగా ఫీలవుతూ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేరుకున్నారా? లేక సినీ పరిశ్రమే వారిని ఆ స్థాయికి తీసుకెళ్తోందా? అనేది ఇప్పటి ప్రశ్న.
ప్రస్తుత రోజుల్లో సినిమాల భవిష్యత్తును, బాక్సాఫీస్ వసూళ్లను ప్రభావితం చేసే స్థాయికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూవర్లు చేరుకున్నారు. సినిమా విడుదలైన మొదటి ఆట ముగియకముందే థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ పేరుతో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేదికగా వీరు ఇచ్చే రివ్యూలు సినిమాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఇంతటితో ఆగకుండా థియేటర్లలోనే సెల్ఫోన్లతో సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు. సినిమాలో ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ సన్నివేశాలు, కీలక మలుపులు ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండటంతో థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల ఆసక్తి దెబ్బతింటోంది.
ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ చిత్రంలో రవితేజ కుమార్తె పాత్ర మరణించే కీలక సన్నివేశం సైతం యూట్యూబ్‌లో ప్రచారంలోకి వచ్చినట్లు సమాచారం. ఆ సన్నివేశం సినిమా కథలో ఎంతో కీలకమైనది. ఇలాంటి సన్నివేశాలు ముందుగానే బయటకు రావడం వల్ల ప్రేక్షకుల ఉత్కంఠ తగ్గడమే కాకుండా, సినిమా వసూళ్లపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
సినిమా టికెట్ కొనుక్కుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి కథలోని కీలక మలుపులను ముందుగానే చూపించే హక్కు ఎవరిచ్చారు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ధోరణి ఒకవైపు సినీ పరిశ్రమకు ప్రచార సాధనంగా మారుతుండగా, మరోవైపు తీవ్ర నష్టాలను కూడా కలిగిస్తోంది.
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినిమాలపై చూపిస్తున్న ప్రభావం, దాని వెనుక ఉన్న ప్రధాన కోణాలను పరిశీలిద్దాం.
-
నెగెటివ్ ట్రోలింగ్.. ఇన్స్టంట్ రివ్యూల ప్రభావం
భారీ అంచనాల మధ్య విడుదలయ్యే పెద్ద సినిమాలపై కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు నిమిషాల వ్యవధిలోనే నెగెటివ్ మీమ్స్, ట్రోల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలోని లోపాలను మాత్రమే అతిగా హైలైట్ చేస్తూ, థియేటర్లకు రావాలనుకునే ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తున్నారు.
ఒక సినిమా ఫలితాన్ని పూర్తిగా అంచనా వేయడానికి తగిన సమయం కూడా ఇవ్వకుండా, మొదటి రోజే తుది తీర్పులు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోందనే ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమవుతోంది.
-
మార్కెటింగ్ మరియు ప్రమోషన్ల కోసం ఇన్ఫ్లుయెన్సర్ల వినియోగం
ఒకప్పుడు సినిమాల ప్రమోషన్లలో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, గుర్తింపు పొందిన మీడియా సంస్థలదే ప్రధాన పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు నిర్మాతలు, హీరోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇన్ఫ్లుయెన్సర్లను తమ సినిమా ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
వైరల్ కంటెంట్ క్రియేటర్లను ఇంటర్వ్యూలలో కూర్చోబెట్టడం, సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం సాధారణమైపోయింది. అయితే, ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించే నిర్మాతలే, ఆ తర్వాత వారి అనుచిత ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది.
-
నిర్మాతలు – ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య వివాదాలు
సినిమా బాగున్నా కొందరు కావాలనే డబ్బుల కోసం (Paid Reviews) తప్పుడు రేటింగ్‌లు ఇస్తున్నారని, అనుకూలమైన రివ్యూలు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నిర్మాతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, థియేటర్ల వద్ద మైకులు పట్టుకుని చేసే పబ్లిక్ టాక్ రివ్యూలు, ఉద్దేశపూర్వక నెగెటివ్ ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు సినీ పరిశ్రమలో వివాదాలకు దారితీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫలితంగా థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలపై ఆంక్షలు విధించాలనే చర్చ మొదలైంది.
సినీ పరిశ్రమ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
సినిమా పరిశ్రమలో డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూవర్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, సినిమాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు టాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చలనచిత్ర పరిశ్రమలు కూడా పలు నియంత్రణ చర్యలపై దృష్టి సారిస్తున్నాయి.
సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే వచ్చే దురుద్దేశపూర్వక నెగెటివ్ రివ్యూలు (Review Bombing), ఇన్ఫ్లుయెన్సర్ల బ్లాక్‌మెయిలింగ్, వసూళ్ల దందా వంటి ఆరోపణలను అరికట్టడమే వీటి ప్రధాన ఉద్దేశం. సినిమా విడుదలైన మొదటి రోజే థియేటర్ల వెలుపల యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రేక్షకుల నుంచి సేకరించే ఫ్యాన్ రివ్యూలు (FDFS Talk) సినిమాల వసూళ్లపై ప్రభావం చూపుతున్నాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఇలాంటి పబ్లిక్ రివ్యూలను నియంత్రించాలనే అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చర్చించినట్లు ఇండియా టుడే కథనాల్లో ప్రస్తావించబడింది.
తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TNPC) కూడా థియేటర్ల వద్ద యూట్యూబర్లు రివ్యూలు తీసుకోకుండా నియంత్రించాలని థియేటర్ల యాజమాన్యాలను కోరినట్లు వార్తలు వచ్చాయి.
లీగల్ నోటీసులు మరియు కంటెంట్ తొలగింపు:
దురుద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లపై నిర్మాతలు చట్టపరమైన చర్యలకు దిగుతున్నారు. కొన్ని పెద్ద సినిమాల విడుదల సందర్భాల్లో ప్రతికూల సమీక్షలు, కంటెంట్‌పై వివాదాలు తలెత్తడంతో సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి.
అలాగే, కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి సోషల్ మీడియా వేదికలను ఆశ్రయించి, అభ్యంతరకరమైన వీడియోలను తొలగించాలని కోరుతున్నారు.
ఎక్స్టార్షన్ (వసూళ్ల దందా) పై కఠిన చర్యలు:
ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (IFTPC) సహా సినీ పరిశ్రమకు చెందిన వర్గాలు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుకూలమైన రివ్యూలు ఇవ్వడానికి లేదా నెగెటివ్ రివ్యూలు వేయకుండా ఉండటానికి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం చేశాయి.
ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత వ్యక్తులపై సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మొదటి 48 గంటలు.. కొన్ని రోజుల పాటు రివ్యూల నియంత్రణ (కేరళ మోడల్):
సినిమా భవిష్యత్తును నిర్ణయించడంలో మొదటి రెండు, మూడు రోజులు కీలకమని భావిస్తున్న నిర్మాతలు, ఆ సమయంలో వచ్చే ఆన్లైన్ రివ్యూలను నియంత్రించాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. గతంలో కేరళలో సినిమా రివ్యూలు, రివ్యూ బాంబింగ్‌పై న్యాయపరమైన చర్చలు, కోర్టు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆన్లైన్ రివ్యూలపై పూర్తిస్థాయి నిషేధం ఉందని భావించకుండా, సంబంధిత కోర్టు ఆదేశాల అసలు పరిధిని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
దర్శక, నిర్మాతల సంఘాల ప్రత్యేక సమావేశాలు:
రివ్యూల పేరుతో సినిమాలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, దర్శకుల కెరీర్లను దెబ్బతీస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర శంకర్ నేతృత్వంలో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించి, యూట్యూబ్ రివ్యూ సంస్కృతిలోని అనుచిత ధోరణులను తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి.
కోర్టుల అభిప్రాయం.. భావప్రకటన స్వేచ్ఛ
సినిమా పరిశ్రమ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రివ్యూలను పూర్తిగా నిషేధించడంపై న్యాయస్థానాల అభిప్రాయాలు, భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన చర్చలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు రివ్యూ బాంబింగ్, ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారం, బ్లాక్‌మెయిలింగ్ వంటి అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఒక సినిమా నచ్చలేదని ప్రేక్షకులు లేదా విమర్శకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును కూడా గౌరవించాలి.
కాబట్టి సినీ పరిశ్రమ లక్ష్యం నిజాయితీగా చేసే విమర్శలను అడ్డుకోవడం కాకుండా, కావాలనే సినిమాను దెబ్బతీసే తప్పుడు ప్రచారం, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, అనధికారికంగా సినిమా సన్నివేశాలను చిత్రీకరించి ప్రచారం చేసే చర్యలను అరికట్టడంగా ఉండాలి.
జర్నలిస్టు సంఘాల బాధ్యత ఏమిటి?
చివరగా, ఈ సమస్య నివారణకు కేవలం నిర్మాతలు, దర్శకులు, ప్రభుత్వాలే కాదు… జర్నలిస్టు సంఘాలు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. తమవంతు కర్తవ్యంగా ప్రెస్మీట్లు, సినిమా ఫంక్షన్లు, మీడియా సమావేశాలకు ఎవరిని అనుమతించాలనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి.
గుర్తింపు పొందిన మీడియా సంస్థలకు సంబంధించిన ఇన్‌చార్జ్‌లు, రిపోర్టర్లు, కెమెరామెన్లు, వృత్తిపరమైన గుర్తింపు కలిగిన డిజిటల్ మీడియా ప్రతినిధులకు మాత్రమే తగిన నిబంధనల ప్రకారం అవకాశం కల్పించాలి. కేవలం చేతిలో మైక్ పట్టుకుని, సొంతంగా ఓ వెబ్సైట్ లేదా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నంత మాత్రాన జర్నలిస్టులమని చెప్పుకునే ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
అదే సమయంలో, నిజాయితీగా పనిచేస్తున్న స్వతంత్ర డిజిటల్ జర్నలిస్టులను కూడా విస్మరించకూడదు. గుర్తింపు, వృత్తిపరమైన నిబద్ధత, బాధ్యత ఆధారంగా మీడియా ప్రతినిధులను ఎంపిక చేయాలి.
ఇకనైనా సంబంధిత PROలు బాధ్యత తీసుకోవాలి.
గుర్తింపు కార్డులు కలిగిన, గౌరవనీయమైన మీడియా సంస్థల ప్రతినిధులకే ప్రెస్మీట్లు, సినిమా ఫంక్షన్లలో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. సినిమా ప్రమోషన్ల పేరుతో ఎవరికిపడితే వారికి ఆహ్వానాలు పంపడం, ముందు వరుసలో కూర్చోబెట్టడం, మీడియా ప్రతినిధులుగా గుర్తించడం వంటి విధానాలకు స్వస్తి పలకాలి.
ఇప్పటికైనా జర్నలిస్టు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే, కొందరి అనుచిత ప్రవర్తన కారణంగా మొత్తం మీడియా వర్గానికే చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. చివరకు నిర్మాతలు మీడియా మొత్తాన్నే దూరం పెట్టే పరిస్థితి రావచ్చు.
అది మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్నట్లే అవుతుంది!
మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు కాలేరు… ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన మీడియా ప్రతినిధులు కాలేరు! జర్నలిజానికి ఒక గౌరవం ఉంది… ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రశ్నించడం జర్నలిస్టు హక్కు… కానీ ప్రశ్నకు ఒక పరిధి, వృత్తికి ఒక గౌరవం, వ్యవహారానికి ఒక బాధ్యత ఉండాలి!
అదే నిజమైన జర్నలిజం!
నండూరి రవి శంకర్, సీనియర్ ఫిలిమ్ జర్నలిస్టు
