ముఖ్యంశాలుహోమ్

70 మంది యువతుల్ని వేధించిన కామపిశాచి

#BilalKhazi

బాలికల్ని అశ్లీల చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక హింసకు పాల్పడిన ఒకడికి 30 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఈ కామ పిశాచి కథ బ్రిటన్ లో జరిగింది. ముంబైకి చెందిన 27 ఏళ్ల భారతీయ యువకుడు ఈ నేరానికి పాల్పడ్డాడు.

రసాయన శాస్త్రంలో పరిశోధన కోసం బ్రిటన్‌లో చదువుకుంటున్న బిలాల్ ఖాజీ 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నేరాలకు పాల్పడ్డాడు. 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలను లక్ష్యంగా చేసుకున్నాడు. స్నాప్‌చాట్, వింక్, రోబ్లాక్స్ వంటి సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ఆటల వేదికల ద్వారా బాలికలతో పరిచయాలు పెంచుకున్నాడు. తాను 14 ఏళ్ల తెల్లజాతి బ్రిటిష్ బాలుడినని నమ్మిస్తూ వారితో ప్రేమ సంబంధం ఉన్నట్లు నటించేవాడు. అతడి మాటలు నమ్మిన బాలికలు అతడితో వ్యక్తిగత విషయాలు పంచుకునేవారు.

బాగా పరిచయం అయిన తర్వాత వారిని లైంగికంగా ప్రేరేపించే ప్రశ్నలు అడుగుతూ, అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపాలని ఒత్తిడి చేసేవాడు. ఒకసారి బాలికలు అలాంటి చిత్రాలు పంపిన తర్వాత వాటిని వారి స్నేహితులకు, ఇతరులకు పంపిస్తానని బెదిరించి మరిన్ని చిత్రాలు, వీడియోలు పంపాలని బలవంతం చేసేవాడు. బాలికలు తన మాట వినకపోతే గతంలో పంపిన చిత్రాలను బహిర్గతం చేస్తానని బెదిరించేవాడు.

13 ఏళ్ల బాలిక ఫిర్యాదుతో కదిలిన డొంక

2021 డిసెంబరులో ఒక బాధితురాలు డెర్బీషైర్ పోలీసులను ఆశ్రయించడంతో విచారణ ప్రారంభమైంది. అప్పటికి 13 ఏళ్ల వయసున్న ఆ బాలిక స్నాప్‌చాట్‌లో బిలాల్‌తో పరిచయం ఏర్పడిందని, అతడిని తన వయసున్న బాలుడిగా భావించి మాట్లాడటం ప్రారంభించానని పోలీసులకు తెలిపింది.

కొద్దిరోజుల్లోనే వారి సంభాషణలు లైంగిక అంశాల వైపు మళ్లాయి. బిలాల్ అనుచితమైన ప్రశ్నలు అడుగుతూ ఆమె నుంచి చిత్రాలు కోరేవాడు. 2021 జూలైలో ఇకపై చిత్రాలు పంపనని, కేవలం స్నేహితులుగానే ఉండాలని బాలిక స్పష్టం చేయడంతో అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెను దూషిస్తూ, తన ఆస్తి అంటూ బెదిరింపులకు దిగాడు. తాను గతంలో పంపిన చిత్రాలు, వీడియోలను ఆమె స్నేహితులకు పంపిస్తానని బెదిరించి తన డిమాండ్లకు అంగీకరించాలని ఒత్తిడి చేశాడు.

బిలాల్ చివరిగా చెస్టర్‌లో నివసించినట్లు గుర్తించడంతో 2022 మేలో చెషైర్ పోలీసు విభాగానికి చెందిన ఆన్‌లైన్ బాలల దుర్వినియోగ విచారణ బృందం దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. విచారణలో అతడి నేరాలకు సంబంధించి 180 మంది బాలికలు బాధితులై ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. అతడి ఫోన్‌లో లభించిన వినియోగదారు పేర్లు, ఇతర డిజిటల్ ఆధారాల సహాయంతో ప్రత్యేక బృందాలు బాధితులను గుర్తించాయి. చివరకు బ్రిటన్‌లోని 45 పోలీసు విభాగాల్లో 28 విభాగాల పరిధిలో ఉన్న 70 మంది బాలికలను బాధితులుగా నిర్ధారించారు. నేరాలు జరిగిన సమయంలో వీరి వయసు 11 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నట్లు వెల్లడైంది.

నేర నిరూపణ కావడంతో బ్రిటన్ న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు బిలాల్ ఖాజీ కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాతే పెరోల్‌కు అర్హత పొందుతాడు. అంతేకాకుండా జీవితాంతం లైంగిక నేరస్థుల జాబితాలో అతడి పేరు కొనసాగనుంది.

తీర్పు అనంతరం చెషైర్ పోలీసు విభాగానికి చెందిన ఆన్‌లైన్ బాలల దుర్వినియోగ విచారణ బృందం డిటెక్టివ్ కానిస్టేబుల్ జార్జియా హ్యూస్ మాట్లాడుతూ, బిలాల్ చేసిన నేరాల విస్తృతి కారణంగా ఈ కేసు దర్యాప్తు అత్యంత సంక్లిష్టంగా మారిందని తెలిపారు. పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది, ప్రత్యేక నిపుణుల సేవలు అవసరమయ్యాయని, వివిధ పోలీసు విభాగాల మధ్య సమన్వయంతో దర్యాప్తు పూర్తి చేసినట్లు చెప్పారు.

అతను లక్ష్యంగా చేసుకున్న బాలికలు చాలా చిన్న వయసులో ఉన్నారని, అతడితో ఏర్పడిన పరిచయాన్ని చాలామంది తమ జీవితంలో తొలి ప్రేమ సంబంధంగా భావించారని ఆమె పేర్కొన్నారు. వారి అమాయకత్వాన్ని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తన ప్రవర్తన సాధారణమేనని నమ్మించే ప్రయత్నం చేశాడని తెలిపారు. అతడి బెదిరింపుల కారణంగా అనేకమంది బాలికలు చాలా కాలం భయంతో జీవించారని, ఈ ఘటనలు వారి జీవితాలపై చెరగని మానసిక ప్రభావాన్ని చూపాయని వివరించారు.

బాల్యావస్థను భయానకం చేసిన కామపిశాచి

బాలికలు తమ జీవితంలో అత్యంత కీలకమైన బాల్య, యవ్వన దశలను ఈ వేధింపుల కారణంగా మానసిక వేదనతో గడపాల్సి వచ్చిందని జార్జియా హ్యూస్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి శిక్ష పడటంతో బాధితులకు కొంత ఊరట లభిస్తుందని, ఇకపై అతడు మరెవరికీ హాని చేయలేడనే భరోసాతో వారు తమ జీవితాల్లో ముందుకు సాగగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసులో బ్రిటన్‌ను విడిచి వెళ్లిన బిలాల్ 2023 జూలైలో తిరిగి దేశానికి వచ్చినప్పుడు హీత్రో విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ విభాగం పరిశీలించింది. అందులో లభించిన ఆధారాలు ఈ నేరాల తీవ్రతను బయటపెట్టాయి. ఆన్‌లైన్ బాలల దుర్వినియోగ విచారణ బృందం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతిపెద్ద నేరాల నెట్‌వర్క్‌లలో ఇదొకటని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

చెస్టర్ క్రౌన్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణలో బిలాల్ ఖాజీ తనపై నమోదైన 37 అభియోగాలను అంగీకరించాడు. బాలికలకు సంబంధించిన అసభ్యకర చిత్రాలను రూపొందించడం, బెదిరింపులకు పాల్పడటం, పిల్లలను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రేరేపించడం వంటి తీవ్రమైన నేరాలు ఇందులో ఉన్నాయి. దీంతో న్యాయస్థానం అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Related posts

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి బాధ!

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

Satyam News

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

Satyam News

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

Satyam News

Leave a Comment