నెల్లూరుహోమ్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

#YogaDay

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన “యోగాంధ్ర–2026” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో యోగా ప్రాముఖ్యత ఎంతో ఉందని ఉద్ఘాటించారు. “యోగా కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, మానసిక వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి మార్గదర్శిగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు యోగా ఒక గొప్ప సాధనమని పేర్కొన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్. మధుమతి మాట్లాడుతూ, విద్యార్థులు నిత్యం యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడిని జయించి, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి. వీరారెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన ఆరోగ్య సంపద యోగా అని కొనియాడారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మరియు పరిశోధక విద్యార్థులు వివిధ ఆసనాలు, ప్రాణాయామాలను నిర్వహించి యోగా గొప్పతనాన్ని చాటి చెప్పారు.

కార్యక్రమ నిర్వాహణలో పాత్ర పోషించిన యోగా శిక్షకురాలు టి. భారతిని వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ కె. సునీత శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి.బి. సుచరిత, ఇతర అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

ఢిల్లీలో లోకేష్‌ మార్క్‌…. యువనేతకి కీలక ఆహ్వానం….!

Satyam News

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam News

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

Satyam News

Leave a Comment