రంగారెడ్డిహోమ్

గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా

#GIGworkers

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన సంక్షేమ చట్టాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఆవిష్కరించారు.

ఈ చట్టం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. వర్కర్ల నమోదుకు ఆన్‌లైన్ విధానాన్ని కూడా ప్రారంభించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ సభలో తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ నిబంధనల పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల బైకులపై ప్రయాణిస్తూ పలువురు మంత్రులతో కలిసి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూ జయంతి రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందించనున్నట్లు చెప్పారు.

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయనున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కార్మికుల వివరాలను నమోదు చేసి సంక్షేమ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ చట్టం రూపకల్పనలో ఐఐటీ వంటి ప్రముఖ సంస్థలతో పాటు సామాజిక కార్యకర్త నిఖిల్ డే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహకరించారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం కార్మికుల అవసరాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు.

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు.

Related posts

జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

Satyam News

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Satyam News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి

Satyam News

మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం రైతులకు వరం

Satyam News

సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Satyam News

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

Leave a Comment