ప్రత్యేకంహోమ్

మమ్మల్ని ఆదుకోండి: ఎల్ నినో, రెండు తుపాన్లతో ఏపీకి తీరని నష్టం

#ChandrababuNaidu

ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు ఒకేసారి రెండు తుఫాన్లు రావడం రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మురసు తుఫాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం తో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన అనంతరం కేంద్ర బృందం ముఖ్యమంత్రితో చర్చించింది.

దాదాపు 60 ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లను పరిశీలించింది. భీమడోలు మండలం సూరప్పగూడెంలో రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టాన్ని అడిగి తెలుసుకుంది. రావులపర్రులో డ్రెయినేజీ వ్యవస్థ, వరి పంటలను పరిశీలించింది. కునకలమర్రులో కొమ్ము కాలువ, రహదారులు, సాగునీటి వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంది. ఏడ్లపాడు–తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారులను కూడా పరిశీలించింది.

తుఫాన్ గమనాన్ని ముందుగానే అంచనా వేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని, తుఫాన్ అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రహదారులు, విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్ వంటి అత్యవసర సేవలను 24 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకువచ్చామని చెప్పారు.

రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుఫాన్లను ఎదుర్కొంటున్నందున భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించేందుకు శాశ్వత పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు. రహదారులు, సాగునీటి వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠంగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేంద్ర బృందం పది రోజుల్లోగా నష్టంపై నివేదిక సమర్పించి, రాష్ట్రానికి తక్షణమే తుఫాన్ సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

తుఫాన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర బృందం సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రీ స్కూల్ యూనిఫామ్స్ అందించాలని పేర్కొంది. తుఫాన్ ప్రభావానికి గురైన ఆదిమ గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పంటలు కోల్పోయిన సందర్భాల్లో వారికి అధిక పరిహారం అందించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మురసు తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.2,484.43 కోట్ల మేర నష్టం సంభవించింది. ఇందులో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం రూ.888.84 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా, 36 చోట్ల గండ్లు పడ్డాయి. 65 కల్వర్టులు దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 220 కిలోమీటర్ల మేర 114 రహదారులు దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

అదే విధంగా వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. మొత్తం 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.874.97 కోట్ల నష్టం సంభవించింది. ఈ ప్రభావం 1,86,063 మంది రైతులపై పడింది. ఉద్యాన పంటలకు సంబంధించి 6,756 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.337.10 కోట్ల నష్టం వాటిల్లింది. 12,605 మంది ఉద్యాన రైతులు నష్టపోయారు.

అలాగే సాగునీటి వ్యవస్థకు సంబంధించి 369 సాగునీటి వనరులు దెబ్బతినగా, 509 చోట్ల గండ్లు పడ్డాయి. విద్యుత్ రంగంలోనూ భారీ నష్టం సంభవించింది. మొత్తం 10,192 పదకొండు కేవీ విద్యుత్ స్తంభాలు, 6,442 ఎల్‌టీ విద్యుత్ స్తంభాలు, 1,448 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.37 కోట్లను ఖర్చు చేసింది.

మురసు తుఫాన్ ప్రభావంతో మొత్తం 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 645 గుడిసెలు ఉన్నాయి. వీటితోపాటు వైద్య ఆరోగ్యశాఖ, మత్స్యశాఖ, పురపాలక శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత రంగాలకు కూడా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో వివరించింది.

Related posts

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

Satyam News

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బతుకమ్మ వేడుకలు

Satyam News

తీవ్ర రూపం దాల్చిన యుక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్: క్రికెటర్ల ఆస్తుల స్వాధీనం

Satyam News

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News

గిగ్ వర్కర్లతో 14న రాహుల్ గాంధీ భారీ ర్యాలీ

Satyam News

Leave a Comment