పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి, పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలు సాంస్కృతిక విలువలు వంటి బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాలని పంచాయతీరాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.
సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో శుక్రవారం నాడు నిర్వహించిన బతకమ్మ పండుగ సంబరాలకు మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణలో ఆడపడుచు ఇంటికి వచ్చిన సందర్భంగా ఇంటిల్లిపాది కాకుండా ఊరంతా తీరొక్క పూలతో బతుకమ్మలు చేసి ఆటపాటలతో సంప్రదాయాన్ని చాటుకుంటారని మంత్రి గుర్తు చేశారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వరుసగా రెండవసారి తాను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషమని సీతక్క అన్నారు. మన పూర్వీకులు అందించిన ఈ బతుకమ్మ పండుగ సంబరాలను మరింత సంప్రదాయంగా జరుపుకోవాలని ఆమె తెలంగాణ ఆడపడుచులకు పిలుపునిచ్చారు. బతుకమ్మ వంటి సంప్రదాయ వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలన్న సీతక్క ఈ సందర్భంగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయకుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు అత్తలూరి అరుణ, ఏ .రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఉమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, మర్యాద రమాదేవి, రచన ముడుంబై, ఎన్. శ్రీనివాసరెడ్డి, అశోక్ దయ్యాల,అమిత్ బట్టు , సైకాలజిస్ట్ డాక్టర్ ఛాయా లత సహ సీనియర్ మహిళా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా జర్నలిస్టుల తో సహా సీనియర్ మహిళా సభ్యులు ఆటపాటలతో ఈ బతుకమ్మ వేడుక ఉత్సాహంగా నిర్వహించారు.
