ప్రపంచంహోమ్

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

#Donald

వెనిజులా అధ్యక్షుడిని బంధించినట్లే ట్రంప్ రష్యా అధ్యక్షుడిని కూడా బంధించబోతున్నారా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రపంచ రాజకీయాలలో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తీరుపై మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన మాట వినని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పూతిన్‌పై కూడా అమెరికా సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టవచ్చన్న ఊహాగానాలను మాత్రం ట్రంప్ ఖండించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నట్టే అలాంటి చర్య రష్యా అధ్యక్షుడి విషయంలో “అవసరం లేదు” అని ట్రంప్ చెప్పారు. మదురో అరెస్టు తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ చేసిన సంకేతాత్మక వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి.

“ఒక నియంతను ఇలా వ్యవహరించాల్సి వస్తే, అమెరికాకు తదుపరి ఏం చేయాలో తెలుసు” అన్నట్టుగా జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ దీనిని పూర్తిగా తిరస్కరించారు. పూతిన్‌తో అమెరికాకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయని, ఆయనను లక్ష్యంగా చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని చమురు, గ్యాస్ రంగానికి చెందిన అగ్ర కార్యనిర్వాహకులతో సమావేశంలో మాట్లాడిన ట్రంప్, ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.

ఉక్రేయిన్ యుద్ధంలో రష్యానే నష్టపోయింది

గత నెలలోనే సుమారు 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో ఎక్కువ మంది రష్యన్ సైనికులేనని చెప్పారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఈ యుద్ధం చివరకు పరిష్కారానికి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ట్రంప్, ఇది మరింత త్వరగా ముగిసి ఉంటే బాగుండేదని అన్నారు.

గతంలో తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఈ సమస్య కూడా అంత తేలికగా పరిష్కారమవుతుందని అనుకున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా, వెనిజులాలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ తీవ్ర అంతర్జాతీయ చర్చకు దారితీసింది. కారకాస్‌లో అర్ధరాత్రి తర్వాత అమెరికా డెల్టా ఫోర్స్ దళాలు మదురో నివాసంపై దాడి చేసి, ఆయనను భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి అదుపులోకి తీసుకున్నాయి.

అనంతరం వారిని అమెరికా సైనిక స్థావరానికి తరలించి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు తీసుకువెళ్లారు. మదురో అరెస్టు తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి, ఈ అమెరికా చర్యను “నేరపూరితమైనది, చట్టవిరుద్ధమైనది”గా ఖండించారు.

మదురో తర్వాతి వెనిజులా పరిణామాలను దేశ చమురు సంపదతో ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా శక్తి సంస్థలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వెనిజులా చమురుపై అమెరికా ప్రత్యక్ష నియంత్రణ ఉండేలా వ్యవస్థ రూపొందిస్తామని చెప్పారు.

అమెరికా కంపెనీలు సుమారు 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, కోట్ల బ్యారెళ్ల వెనిజులా చమురును విక్రయించే ప్రణాళిక కూడా ఉందని, ఆ ఆదాయం ఎలా వినియోగించాలన్నది అమెరికా నిర్ణయిస్తుందని ట్రంప్ ప్రకటించారు.

Related posts

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్

Satyam News

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News

Leave a Comment