ముఖ్యంశాలుహోమ్

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు

#IncomeTax

ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్‌ సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడ సహా పలు ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్‌ డైరెక్టర్లు రామ్‌ రెడ్డి డెండి, వరుణ్‌ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వివరాలు, పన్నుల చెల్లింపులకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు గల పూర్తి కారణాలు, తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

1982లో రామ్‌ రెడ్డి చికెన్‌ మార్కెట్‌ పేరుతో ప్రారంభమైన ఈ వ్యాపార సంస్థ 1994లో స్నేహ ఫామ్స్‌గా విస్తరించింది. అనంతరం పౌల్ట్రీ, వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాల్లో గణనీయంగా విస్తరించి స్నేహ గ్రూప్‌గా అవతరించింది. ప్రస్తుతం పౌల్ట్రీ బ్రీడింగ్‌, చికెన్‌ ప్రాసెసింగ్‌, పశువుల దాణా తయారీతో పాటు సఫల బ్రాండ్‌ పేరుతో వంట నూనెల ఉత్పత్తి వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

తెలంగాణలో గంటకు 12 వేల కోళ్లను ప్రాసెస్‌ చేయగల సామర్థ్యం కలిగిన ఆధునిక ఆటోమేటెడ్‌ ప్లాంట్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా కాంట్రాక్ట్‌ రైతులతో కలిసి పౌల్ట్రీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. భారత రక్షణ సంస్థలకు సైతం ఘనీభవించిన చికెన్‌ను సరఫరా చేస్తోంది.

వ్యాపార విస్తరణలో భాగంగా 2024 ఆర్థిక సంవత్సరంలో సింగ్‌ పౌల్ట్రీ సంస్థను స్నేహ గ్రూప్‌ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ పెట్టుబడులపైనా సంస్థ దృష్టి సారించింది. జపాన్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ మిట్సుయి అండ్‌ కో సైతం స్నేహ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఐటీ శాఖ చేపట్టిన సోదాలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనిఖీలు పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించే వివరాలపై ఆసక్తి నెలకొంది.

Related posts

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

కేరళ స్టోరీ 2కు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

Satyam News

భోగాపురంలో విమానాల తయారీ..?? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

Satyam News

“కోవా బన్” వలీకి అండగా మంత్రి లోకేష్ !

Satyam News

“వడ్డే” కన్నా యూత్ దొరకలేదా?

Satyam News

Leave a Comment