భానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలకు అరసవల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లలో భారంగా మారకుండా, ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక అద్భుతమైన ‘వ్యూహ రచన’ చేసింది.
మ్యాప్ మొదలుకొని క్షేత్రస్థాయి వసతుల వరకు ప్రతి అడుగులోనూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.ఆరు వరుసల వ్యూహం.. అరగంటలో దర్శనం జరిగేలా ఏర్పాటు చేశారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు మొత్తం ఆరు సెక్టార్లుగా ఆలయ పరిసరాలను విభజించారు.
గతంలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితిని మార్చుతూ, గుడి లోపలి వరకు ఆరు వరుసల క్యూలైన్లను నిర్మించారు.
సెక్టార్ల వారీగా విభజన :
సెక్టార్ 1: మామిడి తోట జంక్షన్ నుండి అసిరితల్లి ఆలయం మీదుగా వెళ్లే మార్గం. ఇక్కడ రూ. 100, ఉచిత క్యూ లైన్లు ఉంటాయి.
సెక్టార్ 2: ఇంద్ర పుష్కరిణి ప్రాంతం. ఇక్కడ ఉచిత దర్శనం, రూ. 100 భక్తుల కోసం వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
సెక్టార్ 3, 3ఏ: బొంపడ వీధి నుండి వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) వరకు ఉండే వి.ఐ.పి ఎంట్రీ మార్గం. దీన్నే ఈసారి కొత్తగా ప్రతిపాదించారు. ఫలితంగా ప్రజా ప్రతినిధులకు, సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. వీఐపీలు దర్శనం అనంతరం గుడి వెనకనుంచి తిరిగి అదే ద్వారం గుండా బయటికి వస్తారు.
సెక్టార్ 4: ప్రధాన ఆలయ లోపలి భాగం. అన్ని లైన్లు వేరువేరుగా ఇక్కడే కలుస్తాయి. ఇక్కడ భక్తులు వేరువేరుగా, సులువుగా దర్శించుకునేలా వేదికలను ఎత్తుల వారీగా సిద్ధం చేశారు. ఆరు వరుసల్లో వేరువేరుగా సులువుగా దర్శనం కల్పించేందుకు అడుగు, రెండు, మూడు అడుగులు చొప్పున ఏర్పాట్లు ఉన్నాయి.
సెక్టార్ 5: బ్రాహ్మణ వీధి. ఆలయ దర్శనం తర్వాత భక్తులు బయటకు వెళ్లే మార్గం. అక్కడే ప్రసాద కౌంటర్లు, చెప్పుల స్టాండ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.
సెక్టార్ 6: మిల్ జంక్షన్ నుండి అసిరితల్లి ఆలయం వరకు ఉండే ప్రధాన రహదారి (శ్రీకాకుళం నుండి కళింగపట్నం రోడ్డు). గతంలో ఒక దాత (డోనార్) పాస్‌తో నలుగురిని అనుమతించే పద్ధతిని తీసేసి, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పాస్ ఇవ్వడం ద్వారా పారదర్శకత పెంచారు.
అడుగడుగునా కొబ్బరి చలువ..
క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా భారీ ఎత్తున కొబ్బరి చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వీటి కింద నిరంతరాయంగా మంచినీరు అందించేలా స్టీల్ సర్వీస్ లైన్లను, స్టీల్ గ్లాస్ లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఈసారి ఉచితంగా లక్షకు పైగా లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
పరిసరాల్లో చిన్న అపశ్రుతి కూడా చోటు చేసుకోకుండా 257 సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ఆలయం పక్కనే ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. నగరం వెలుపల నుంచే భక్తుల ప్రవాహాన్ని ట్రాక్ చేసేలా ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అలాగే మ్యాప్‌లో చూపిన విధంగా సెక్టార్ 1, 2, 5 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు.
ట్రాఫిక్ తిప్పలకు చెక్.. వి.ఐ.పిల కోసం సరికొత్త రూట్!
వాహనాల రద్దీని నివారించేందుకు కలెక్టర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వి.ఐ.పి వాహనాలు సింహద్వారం వరకు వెళ్లి తిరిగి అదే దారిలో వెనక్కి వచ్చేవి. ఈసారి వాటిని అసిరితల్లి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు మీదుగా లక్ష్మీ నగర్ మీదుగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం రోడ్డులోకి బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
సాధారణ ప్రజల వాహనాల కోసం 80 ఫీట్ల రోడ్డు (సెక్టార్ 9) వద్ద విశాలమైన పార్కింగ్ కల్పించారు. దర్శనం ముగిసిన తర్వాత ప్రతి భక్తుడు బ్రాహ్మణ వీధి (సెక్టార్ 5) గుండా బయటకు రావాలి. సామాన్య భక్తులకు పెద్దపీట ;ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. “రథసప్తమి రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం.
మా ప్రధాన లక్ష్యం సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే. గుడి లోపలి వరకు ఆరు క్యూలైన్ల వరుసలను ఏర్పాటు చేయడం ద్వారా అరగంటలోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భక్తులెవరూ తొందరపడకుండా, యంత్రాంగానికి సహకరించి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని” ఆకాంక్షించారు.
