అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (ఐ సి సి డి) సందర్భంగా మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి పాల్గొన్నారు.
క్యాన్సర్ చికిత్స పొందుతున్న చిన్నారులకు ధైర్యం, ఆనందం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం(ఐ సి సి డి) ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. చిన్నారుల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై అవగాహన పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 2024 నుంచి 2026 వరకు ఐ సి సి డి కార్యక్రమానికి సవాళ్లను ఎదుర్కోవటం, స్ఫూర్తిదాయకమైన చర్యల ద్వారా ప్రతిభను ప్రదర్శించడం అనే రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.
ఈ థీమ్ ద్వారా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలు, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు, వారి సంరక్షకులు, వైద్య సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పెడియాట్రిక్ ఆంకాలజీ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులకు సుధా రెడ్డి చిత్రలేఖన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులకు ఒక వైపు వినోదాన్ని అందించడంతో పాటు, వారి భావాలను చిత్రాల రూపంలో వ్యక్తపరచుకునే అవకాశం కల్పించింది.
చికిత్స ఒత్తిడిని కొంతసేపు మర్చిపోయి పిల్లలు ఉత్సాహంగా ఈ చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు. దీంతో చిన్న పిల్లల వార్డు ఆనందకరమైన వాతావరణంనెలకొంది. పోటీలో పాల్గొన్న ప్రతి చిన్నారికి బహుమతులు ,పురస్కారాలు అందజేశారు. ప్రతి చిన్నారి తన కృషికి గుర్తింపు పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
అదనంగా, చికిత్స సమయంలో అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ డైట్ కిట్లు కూడా పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు మానసిక ధైర్యాన్ని పెంచడంతో పాటు, వారి ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తాయని ఈ సందర్భంగా మాట్లాడిన సుధా రెడ్డి అన్నారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సలో మానసిక, సామాజిక మద్దతు, సరైన పోషణ ఎంతో ముఖ్యమని తెలిపారు.
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ బీరప్ప మాట్లాడుతూ బాల్య క్యాన్సర్ బాధిత చిన్నారుల పట్ల సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి సేవాభావం, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. మెడికల్ ఆంకాలజీ విభాగం తరఫున సుధా రెడ్డి, ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. సదాశివుడు గుండేటి, విభాగ అధ్యాపకులు, రెసిడెంట్ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
