25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

త్వరలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని చారిత్రక ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పదికి పైగా ఉద్యమ సంఘాలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉద్యమకారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని కవిత అంగీకరించారు.

“తెలంగాణ వచ్చాక మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను. మనవాళ్లే గాయం చేయడంతో ఆ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది” అని వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాలనలో ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరగలేదని, అహంకారం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని ఆమె విశ్లేషించారు.

కేశవరావు జాదవ్ వంటి మహనీయులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం, ట్యాంక్ బండ్ పై జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోవడం వంటి అంశాలను ఆమె గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని మండిపడ్డారు. కోదండరాం, ఆకునూరి మురళి వంటి వారు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తున్నా వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కోసం నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని ప్రజలే బిల్డింగ్ బయటకు గుంజుతారని వ్యాఖ్యానించారు.ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ, త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత ప్రకటించారు.

ఇది కేవలం ఎన్నికల కోసం పెట్టే పార్టీ కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే ఫక్తు తెలంగాణ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను సిద్ధం చేశామని, అందులో నమోదైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ధర్మం ఉద్యమకారుల వైపే ఉందని, వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతానని కవిత పునరుద్ఘాటించారు.

Related posts

బాపట్ల జిల్లాలో వైభవంగా శ్రీరాముని కళ్యాణం

Satyam News

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News

వేగంగా పల్నాడు ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’

Satyam News

Leave a Comment