ప్రపంచంహోమ్

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

#RedfortAttack

ఎర్రకోటపై దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానిటరింగ్ టీమ్ తన 37వ నివేదికలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) పలు దాడులకు బాధ్యత వహించినట్లు నమోదు చేసింది.

గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ఈ సంస్థకు సంబంధం ఉన్నట్లు ఒక సభ్య దేశం సమాచారం ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న జెఈఎం నివేదిక కాలంలో జరిగిన అనేక దాడులకు తామే బాధ్యులమని ప్రకటించినట్లు కూడా అదే సభ్య దేశం తెలిపినట్టు వెల్లడించింది.

దేశంలోని అత్యంత భద్రత కలిగిన వారసత్వ ప్రదేశాలలో ఒకటైన ఎర్రకోటపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ విషయాలు ప్రస్తావనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, జెఈఎం చీఫ్ మొహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్టోబర్ 8న ‘జమాత్ ఉల్ ముమినాత్’ పేరుతో మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించినట్టు నివేదిక వెల్లడించింది.

మహిళల కోసం మరో ఉగ్రవాద సంస్థ

ఈ కొత్త విభాగం ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో లేకపోయినా, ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడమే దీని లక్ష్యమని ఒక సభ్య దేశం తెలిపింది. ఇది సంస్థలో వ్యూహాత్మక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 22న జెఈఎం “తుఫత్ అల్ ముమినాత్” పేరుతో ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించినట్లు కూడా వెల్లడైంది.

ఈ కోర్సు ద్వారా మహిళలను తీవ్రవాద భావజాలానికి ఆకర్షించి, వారిని చురుకుగా మద్దతుదారులుగా మార్చేందుకు రోజువారీ వర్చువల్ ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది సంస్థ విస్తృత నియామక మరియు తీవ్రవాద ప్రచార వ్యూహంలో భాగంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ అంశంపై అంతర్జాతీయ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో సభ్య దేశం జెఈఎం ప్రస్తుతం క్రియాశీలంగా లేదని, అది నిర్వీర్యమైన సంస్థగా మారిందని మానిటరింగ్ టీమ్‌కు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. సభ్య దేశాల పేర్లను మానిటరింగ్ టీమ్ వెల్లడించలేదు. అయితే వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం జెఈఎం నిర్వీర్యమైందని చెప్పిన దేశం పాకిస్థాన్ అయ్యి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ వివరాలు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక వ్యవస్థ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థల వల్ల ఏర్పడుతున్న ముప్పును అంచనా వేయడానికి మానిటరింగ్ టీమ్ క్రమం తప్పకుండా విడుదల చేసే నివేదికలో భాగంగా వెల్లడయ్యాయి. ప్రాంతంలో ఉగ్ర నెట్వర్క్‌ల కార్యకలాపాలపై అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతున్న సమయంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam News

కూటమి పాలనలో అన్ని అక్రమ అరెస్టులే

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

Leave a Comment