మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
దాదాపు రూ. 294.20 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద ముప్పు నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ లోకేష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కేవలం ఏడాది కాలంలోనే రూ. 294.20 కోట్ల పరిపాలనా అనుమతులు సాధించడమే కాకుండా, టెండర్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో వచ్చే భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని, 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా అత్యంత శక్తివంతమైన డిజైన్‌తో ఈ రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు.
ఇది కేవలం సాధారణ గోడ మాత్రమే కాదు.. భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి, పైల్-రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా దీనిని రూపొందించారు.
ఈ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50 వేల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరద భయం తప్పుతుంది. అలాగే అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు ఇది రక్షణ కవచంలా నిలవనుంది.
మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లోకేష్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. నియోజకవర్గంలోని చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం పారిశ్రామిక పార్కులు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఐటీ మరియు అనుబంధ పరిశ్రమలను మంగళగిరి పరిసర ప్రాంతాలకు తీసుకువస్తూ, తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, భూముల క్రమబద్ధీకరణ, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కీలక సమస్యలను పరిష్కరిస్తూ సామాన్యుడికి భరోసా కల్పిస్తున్నారు. ఇచ్చిన మాట తప్పని నేతగా లోకేష్ మంగళగిరిలో అభివృద్ధి ప్రభంజనం సృష్టిస్తున్నారు.
