జాతీయంహోమ్

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

#HimanthaBiswaSharma

అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో వివాహాలు, విడాకులు, వారసత్వ హక్కులు, సహజీవన సంబంధాలపై అన్ని మతాలకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

బిల్లులో అత్యంత కీలక అంశంగా బహుభార్యత్వంపై పూర్తి నిషేధాన్ని ప్రతిపాదించారు. ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించే నిబంధనలను చేర్చారు. అలాగే సహజీవన సంబంధాలను కూడా చట్టబద్ధ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలు తప్పనిసరిగా తమ సంబంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయని సహజీవన సంబంధాలను చట్టపరంగా చెల్లనివిగా పరిగణించే అవకాశం ఉన్నట్లు బిల్లులో పేర్కొన్నారు.

ఈ బిల్లులో పురుషుల కనీస వివాహ వయస్సు ఇరవై ఒకటేళ్లు, మహిళల వివాహ వయస్సు పద్దెనిమిదేళ్లుగానే కొనసాగించారు. వివాహం, విడాకులు తప్పనిసరిగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాలని ప్రతిపాదించారు. వారసత్వ హక్కుల విషయంలో మతపరమైన వ్యక్తిగత చట్టాల స్థానంలో సమాన పౌర నిబంధనలు అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే అసోమ్‌లోని షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టాన్ని వర్తింపజేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన సమాజాల సంప్రదాయాలు, ఆచారాలు, వారసత్వ పద్ధతులు, కుటుంబ వ్యవస్థలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. గిరిజనుల సాంస్కృతిక హక్కులకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బిల్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలులో భాగమని చెప్పారు. ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ఉమ్మడి పౌరసత్వ విధానాన్ని అమలు చేశాయని, కానీ అసోమ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మార్పులు చేసి ఈ చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. గిరిజన సంప్రదాయాలను పూర్తిగా రక్షించే విధంగానే బిల్లు తయారైందని స్పష్టం చేశారు.

“వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాల విషయంలో చట్టాలను సరళీకృతం చేసి సమగ్ర వ్యవస్థ తీసుకురావడమే ఈ బిల్లుద్దేశ్యం” అని హిమంత బిశ్వశర్మ తెలిపారు. సహజీవన సంబంధాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం ద్వారా మహిళలు, పిల్లల హక్కులను రక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌, రైజోర్ దళ్‌, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలతో విస్తృత చర్చలు జరపకుండా బిల్లును తీసుకురావడం సరైంది కాదని విమర్శించాయి. మతపరమైన, సామాజిక వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్ తర్వాత అసోమ్ రెండో రాష్ట్రంగా నిలిచే అవకాశముంది. ఈ బిల్లు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Satyam News

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

Satyam News

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

Satyam News

అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

Satyam News

22A భూముల వ్యవహారంలో ఏ-1 రేవంత్, ఏ-2 పొంగులేటి

Satyam News

Leave a Comment