మెగా డిఎస్సీ నిర్వహించి 16 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసి ఏడాది గడిచిన తర్వాత వైసీపీ ఇప్పుడు అదే అంశంపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఎక్కడా ఫిర్యాదుదారులు లేకపోయినా వైసీపీ మెగా డిఎస్సీపై చేస్తున్న ఫేక్ ప్రచారం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. డిఎస్సీ ద్వారా రిక్రూట్ అయి టీచర్లుగా పని చేస్తున్నవారు వైసీపీ ఫేక్ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 ప్రక్రియపై బురదజల్లడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. నిరుద్యోగుల్లో తీవ్ర అయోమయం సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ సోషల్ మీడియా వింగ్ అల్లిన ఫేక్ డీఎస్సీ కథనాలకు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్, SCERT ఇచ్చిన అధికారిక క్లారిఫికేషన్లతో గట్టి చెక్ పడింది.
డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించడానికి వైసీపీ నేతలు ఫేక్ నరేటివ్‌ను స్క్రీన్ పైకి తెచ్చారు. సిలబస్ మార్చేశారని, అర్హతల్లో కోత పెట్టారంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ఫేక్ ప్రచారంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి – SCERT క్లారిటీ ఇచ్చింది.
అత్యంత పారదర్శకంగా రిక్రూట్ మెంట్ జరిగింది
డీఎస్సీ సిలబస్, పరీక్షల పాటర్న్ అంతా ముందుగా నిర్ణయించిన నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేసింది. వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవన్నీ నకిలీ జీవోలని, అభ్యర్థులు వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. దీంతో నిరుద్యోగులను భయభ్రాంతులకు గురిచేయాలన్న వైసీపీ ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ అయింది.
మరోవైపు క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ, PET ఉద్యోగాల విషయంలో కూడా కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మైక్ దొరికిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పుకొచ్చారు. దీనిపై స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ వైసీపీ అబద్ధాల కోటలను బద్దలు కొట్టింది.
పకడ్బందిగానే స్పోర్ట్స్ కోటా రిక్రూట్ మెంట్
స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థుల ఎంపిక, సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ అంతా పక్కా గైడ్‌లైన్స్ ప్రకారం, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా జరుగుతోందని వివరించింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థుల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఐదేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క మెగా DSC కూడా సరిగ్గా నిర్వహించకుండా, కోర్టుల చుట్టూ తిప్పుతూ నిరుద్యోగుల జీవితాలను నట్టేట ముంచిన చరిత్ర వైసీపీది. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి, చివరకు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. మెగా డీఎస్సీని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో వైసీపీ రోజుకో ఫేక్ వార్తను వదులుతోంది కానీ, ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు లెక్కలతో సహా క్లారిటీ ఇస్తుండటంతో వైసీపీ సోషల్ మీడియా బతుకు నవ్వులపాలవుతోంది.
