ఆధ్యాత్మికంహోమ్

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

#Bhadrachalam

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచేలా పునరుద్ధరణ పనులను వచ్చే గోదావరి పుష్కరాల నాటికి వంద శాతం పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

పుష్కరాల ప్రారంభానికి 15 రోజుల ముందే క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ, ఇంజినీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమి పర్వదినాన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాద్రి పునరుద్ధరణకు నాంది పలికాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసింది. ఆలయ విస్తరణ, అభివృద్ధికి అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ కోసం ఇప్పటికే రూ.75 కోట్లు వెచ్చించాం” అని వివరించారు.

ఆగమశాస్త్రం ప్రకారం.. అదనపు కార్మికులతో!

భద్రాద్రి క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక విశిష్టత చెక్కుచెదరకుండా, నిపుణులైన శిల్పులతో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. “పురాతన గోపురాలు, కట్టడాల సహజత్వానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రాల ప్రకారం పనులు జరగాలి. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన చోట ప్రస్తుత సిబ్బంది కంటే 25 శాతం అదనంగా కార్మికులను నియమించాలి.

నిరంతరం నిపుణులు, బాధ్యతాయుతమైన అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలి” అని ఆదేశించారు. ఒకవైపు పనులు పూర్తయిన తర్వాతే మరోవైపు పనులు ప్రారంభించాలని, ఎక్కువ పని ఉన్న ఉత్తర భాగంలో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రాయింగ్‌లు, సాంకేతిక అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు.

పది రోజులకోసారి క్షేత్రస్థాయి సమీక్ష

ఆలయ పనుల పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని వెంటనే నియమించాలని దేవాదాయ కమిషనర్ హనుమంతరావును మంత్రి టెలిఫోన్ ద్వారా ఆదేశించారు. కమిషనర్ ప్రతి 10 రోజులకోసారి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతిని పరిశీలించాలన్నారు.

పనులు జరుగుతున్న సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో భక్తుల విజ్ఞప్తుల మేరకు నూతన స్నాన ఘట్టాల నిర్మాణం, యాత్రికుల వసతుల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

తొలుత సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ వద్ద మంత్రికి కలెక్టర్ అంకిత్ మొక్క అందించి స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో దామోదరరావు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రికి వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, గ్రామ సర్పంచ్ పూనెం దొర, ఆర్కిటెక్ట్ మూర్తి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News

న్యాయ వ్యవస్థలో అవినీతి పై వ్యాసం: సుప్రీం ఆగ్రహం

Satyam News

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు మేం సిద్ధం

Satyam News

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Satyam News

Leave a Comment