దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలను కట్టడి చేసేందుకు 13 రాష్ట్రాలు, 11 కేంద్ర భాగస్వామ్య సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సమన్వయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని TGiCCCలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ (JCCT-IV) సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో 13 రాష్ట్రాలకు చెందిన 45 మంది పోలీసు, దర్యాప్తు అధికారులు, I4C, CERT-In, NCRB, RBI, ED, CBI, IB, DoT తదితర 11 కేంద్ర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన పోలీసు అధికారులు కూడా ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
సైబర్ నేరాల నియంత్రణ, రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, పరస్పర దర్యాప్తు సహకారం, నేరాల హాట్స్పాట్ల గుర్తింపు, వ్యవస్థీకృత ముఠాలపై ఉమ్మడి చర్యలు ఈ సమావేశ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో జేసీసీటీలు పనిచేస్తున్నాయి.
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ భేష్
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ జేసీసీటీ-IVను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 24 శాతం పెరగగా, తెలంగాణలో 3 శాతం తగ్గాయని తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల వల్ల జరిగిన ఆర్థిక నష్టాలు 4 శాతం మాత్రమే తగ్గితే, తెలంగాణలో 20 శాతం తగ్గినట్లు వెల్లడించారు.
సైబర్ నేరాలు ప్రస్తుతం వ్యవస్థీకృత పరిశ్రమగా మారాయని, నేరం జరిగిన తర్వాత డబ్బును తిరిగి రాబట్టడమే కాకుండా, అసలు నేరం జరగకుండా నిరోధించడంపై దృష్టి పెట్టాలని డీజీపీ సూచించారు. నేరగాళ్లకు బాధితులను చేరుకునే మార్గాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు అందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రాష్ట్రాల సరిహద్దులను దాటి ఒకే నెట్‌వర్క్‌గా పనిచేస్తున్నారని, దర్యాప్తు సంస్థలు మాత్రం అధికార పరిధుల పరిమితుల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కేసుల వారీ దర్యాప్తు విధానానికి బదులుగా రియల్‌టైమ్ సమాచార మార్పిడి, ఇంటెలిజెన్స్ ఆధారిత దర్యాప్తు, బహుళ రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
I4C సీఈఓ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ స్కామ్ కేంద్రాలు ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక తదితర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు అధికారులకు ఉపయోగపడేలా ఏకీకృత దర్యాప్తు వేదిక, అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేసేందుకు బ్యాంకులకు మార్గదర్శకాలు, సైబర్ నేరాల మౌలిక వసతులపై దేశవ్యాప్త ప్రత్యేక ఆపరేషన్లను వివరించారు.
సమావేశంలో మహిళలు, పిల్లలపై ఆన్లైన్ నేరాలు, కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగం, సైబర్ నేరాల దర్యాప్తు సాధనాలు, మ్యూల్ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక మోసాలు, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై చర్చించారు. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉత్తమ విధానాలను కూడా ప్రస్తావించారు.
బ్యాంకులు, టెలికాం సంస్థలు, డిజిటల్ వేదికలతో సమన్వయం పెంచడం, నోడల్ అధికారుల నియామకం, అత్యవసర సమాచార మార్పిడి, సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్లకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సమావేశంలో వెలువడిన సిఫార్సులను అన్ని రాష్ట్రాలు, సంస్థలకు పంపించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
