వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి టీ హరీష్ రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఆవరణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వడ్ల కుప్పల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని ఆరోపించారు.
చౌటుప్పల్ మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన హరీశ్ రావు, నెల రోజులుగా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 44 డిగ్రీల ఎండలో రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని, ప్రభుత్వం పూర్తిగా చేతగానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, విద్యుత్ సరఫరా నుంచి పండించిన పంట అమ్ముకునే దశ వరకు ప్రతి అడుగులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాల్లో వడ్లు బాగా కొంటున్నామని చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. “ఏసీ రూమ్‌లలో కూర్చొని మాట్లాడటం కాదు.. రైతుల మధ్యకు వచ్చి వారి గోస వినాలి” అంటూ ఆయన సవాల్ విసిరారు.
మాయిశ్చర్ పరీక్షకు పది రోజులు, సంచులు రావడానికి మరో వారం, కాంటా కోసం మరికొన్ని రోజులు పడుతోందని, మిల్లులకు వెళ్లాక కూడా బస్తాలకు 4 నుంచి 5 బస్తాల వరకు కటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. మార్కెట్‌లో తరుగు, మిల్లుల్లో కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
“ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా” అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని హరీశ్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 69 సార్లు ఢిల్లీ వెళ్లడం కంటే రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. “తరుగు పెడితే తోలు తీస్తా” అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతి బస్తాకు 2-3 కిలోల కోత పడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మంచిర్యాలలో అకాల వర్షాలతో గోడ కూలి రైతులు మరణించిన ఘటనలను గుర్తు చేసిన హరీశ్ రావు, నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల వద్ద రైతు గుండె ఆగి చనిపోయాడని తెలిపారు. ఇంకా ఎంతమంది రైతులు బలైతే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోళ్లు సరిగా చేయలేక అబద్ధాలు చెబుతోందన్నారు. తాను మార్కెట్‌కు వస్తున్నానని తెలిసి ఈరోజే కొంతమంది లారీలు పంపించారని, తాము వస్తే తప్ప ప్రభుత్వం కదలడం లేదని విమర్శించారు.
రైతు భరోసా వారోత్సవాలు పేరుతో ప్రభుత్వం సంబరాలు చేయడం సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు వారోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించిన ఆయన, కూరగాయలు, ఆయిల్ పామ్ రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ రైతులకు నెలలు గడిచినా డబ్బులు చెల్లించలేదని, జొన్నలు, శనగలు కూడా కొనడం లేదని ఆరోపించారు.
వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో చౌటుప్పల్ మార్కెట్ నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే లారీలు, గన్నీ బ్యాగులు అందుబాటులోకి తెచ్చి, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
