ప్రత్యేకంహోమ్

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

#AiushiSharma

ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లినే చంపేస్తారా? చంపేస్తా… అని ఆయుషి శర్మ అంటున్నది. నిర్ఘాంతపోయే ఈ సంఘటన జైపూర్‌లో జరిగింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది.

45 ఏళ్ల నీరజ్ శర్మ హత్య కేసులో ఆమె 23 ఏళ్ల కుమార్తె ఆయుషి శర్మతో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది. తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించినా, సీసీటీవీ దృశ్యాలు, పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నీరజ్ శర్మ జైపూర్‌లోని కోర్టులో కోర్టు క్లర్కుగా విధులు నిర్వహిస్తోంది. జూలై 3న తన కుమారుడిని శిక్షణ కేంద్రం వద్ద దించి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రతాప్ నగర్ ప్రాంతంలో వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాల్లోకి ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలోని నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

ప్రారంభంలో పోలీసులు దీనిని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం చేపట్టిన దర్యాప్తులో ఇది ముందుగానే పథకం ప్రకారం చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు.

తూర్పు జైపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ రంజిత శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించాడు. ఆయన మరణానంతరం కారుణ్య నియామకం కోటాలో ప్రభుత్వ ఉద్యోగం నీరజ్ జవర్మకు లభించగా, ఆ ఉద్యోగాన్ని స్వీకరించి కోర్టులో చేరింది. అయితే ఆ ఉద్యోగం తనకు రావాలని కుమార్తె ఆయుషి ఆశపడింది. ఇదే విషయంపై తల్లీకూతుళ్ల మధ్య విభేదాలు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తి విషయంలో కూడా తీవ్ర వివాదం కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల ఆరోపణల ప్రకారం, ఆయుషి తన మేనమామ మోహన్ స్వరూప్, బంధువు బలరామ్ అలియాస్ రవితో కలిసి తల్లిని హత్య చేయడానికి కుట్ర పన్నింది. ఈ హత్య కోసం భరత్‌పూర్‌కు చెందిన హేమంత్ శర్మకు రూ.7 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితులు మొదట అద్దెకు తీసుకున్న థార్ వాహనంలో నీరజ్ శర్మ రోజువారీ కదలికలను గమనించారు. తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ దాదాపు నెలరోజుల పాటు ఆమె ప్రయాణ మార్గాలు, సమయాలను పరిశీలిస్తూ సరైన అవకాశాన్ని ఎదురు చూశారు. చివరకు స్కార్పియో వాహనాన్ని ఉపయోగించి హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన రోజు నీరజ్ శర్మ ఎటు వెళుతున్నదీ అనే వివరాలను నిందితులు పరస్పరం పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మోహిత్ శర్మ సమాచారాన్ని అందించగా, రోహిత్ జాటవ్ మోటార్‌సైకిల్‌పై సమీపంలో వేచి ఉన్నాడు. ఆకాష్ శర్మ స్కార్పియోను నడపగా, అరవింద్ శర్మ అతనితో కలిసి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢీకొట్టిన అనంతరం స్కార్పియోను అక్కడే వదిలేసి మోటార్‌సైకిల్‌పై పరారైనట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై నీరజ్ శర్మ సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఫిర్యాదు చేశారు. కుటుంబ ఆస్తి విషయంలో కుమార్తెతో పాటు ఇతర బంధువులు తన సోదరిని తరచూ వేధించేవారని, ఆమెకు పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు కూడా వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా ఆయుషి తన తండ్రి మరణానంతరం లభించిన ప్రభుత్వ ఉద్యోగం తనకు రావాలని కోరుకున్నానని, కానీ ఆ ఉద్యోగాన్ని తల్లి స్వీకరించడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనే ఆశే ఈ హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఆయుషి శర్మ, మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాటవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న బలరామ్ అలియాస్ రవి ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రక్రియ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Related posts

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

లోడర్ ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు

Satyam News

మహా శివరాత్రి నుంచి శ్రీశైలం లో ఉచిత లడ్డూలు

Satyam News

ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు దంపతుల అల్పాహారం

Satyam News

Leave a Comment