బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి పదవికి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, బీహార్ ఎన్నికల పర్యవేక్షకుడు అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, “అందరితో చర్చించాను. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా నిర్ణయించాం” అని తెలిపారు. “తేజస్వీకి రాజకీయ భవిష్యత్తు ఉంది. ప్రజలు కూడా ఆయనను ఆమోదిస్తారు” అని ఆయన అన్నారు.
అలాగే విఐపీ వ్యవస్థాపకుడు ముకేష్ సహ్నీని ఉప ముఖ్యమంత్రిపదవికి కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. మరో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని తరువాత ప్రకటిస్తామని తెలిపారు. తేజస్వీ యాదవ్ అభ్యర్థిత్వ నిర్ణయం మహా ఘట్ బంధన్ కూటమికి, ముఖ్యంగా యువత, వెనుకబడిన వర్గాల ఓటర్లకు పెద్ద ఊతమిచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.
అయితే కూటమి పోస్టర్‌లో రాహుల్ గాంధీ ఫోటో లేకపోవడం కాంగ్రెస్‌లో అసంతృప్తికి దారితీసింది. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ముఖం చూసి మాత్రమే ప్రజలు ఓటు వేస్తారు” అని వ్యాఖ్యానించారు. సీట్ల కేటాయింపు విషయమై కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఇంకా తుది నిర్ణయం రాలేదు. కనీసం 11 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షాల మధ్యనే పోటీ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఎన్డీఏ తమ ముఖ్యమంత్రిపదవి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడాన్ని గెహ్లాట్ విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఏక్ నాథ్ షిండేను సీఎంగా ప్రకటించి తరువాత మార్చిన ఉదాహరణను చూపుతూ ఆయన విమర్శించారు. అలాగే ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ తనను సీఎంగా ప్రకటించినందుకు కూటమి నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఎన్డీఏపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “అమిత్ షా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వేరే భాషలో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారని అంటున్నారు.
ఇది బీహారీలందరికీ ఆందోళన కలిగించే అంశం” అని అన్నారు. నితీశ్ ప్రభుత్వాన్ని అవినీతి, అశాంతి పాలనకు ప్రతీకగా ఆయన అభివర్ణించారు. తేజస్వీ మాట్లాడుతూ ఎన్డీఏ ఇప్పటి వరకు మానిఫెస్టో కూడా విడుదల చేయలేదని, తాను ప్రకటించిన పథకాలనే వృద్ధాప్య పెన్షన్, మహిళా సాధికారత, ఉచిత విద్యుత్ వంటి అంశాలను దొంగిలిస్తున్నదని ఆరోపించారు.
తాను పాలనలో ఉన్నప్పుడు కులగణన సర్వే నిర్వహించి రిజర్వేషన్‌ను 65 శాతానికి పెంచామని, కానీ కేంద్రంలోని “వెనుకబడిన వర్గాలకు వ్యతిరేక ప్రభుత్వం” దాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చలేదని పేర్కొన్నారు. తాను సీఎంగా ఎన్నికైతే “కొత్త బీహార్”ను నిర్మిస్తానని తేజస్వీ హామీ ఇచ్చారు.
ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించే హామీని మరోసారి పునరుద్ఘాటించారు. “ఎన్డీఏ ‘జంగిల్ రాజ్’ అంటుంది, కానీ ప్రతిరోజూ హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిందితులపై చర్య లేదు. మేము అవినీతి, చట్టరాహిత్యంపై ఎటువంటి రాజీకి సిద్ధం కాదు” అని అన్నారు.
నితీశ్ 20 ఏళ్లుగా పాలనలో ఉన్నప్పటికీ బీహార్‌కు అభివృద్ధి రాలేదని, దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. సమాజాన్ని కుల, మతాల ఆధారంగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య కూడా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మార్పు ఖాయం అని అన్నారు.
