చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం సహజం. కానీ, ఒక పాలకుడి విద్వేషం వల్ల, ఒక వ్యవస్థీకృత కుట్ర వల్ల పురిటిలోనే గొంతు నులమబడిన రాజధాని ఏదైనా ఉందంటే అది ‘అమరావతి’ మాత్రమే ఐదేళ్ల పాటు సాగిన ఆ అరాచక పర్వం ముగిసింది. కక్షసాధింపు రాజకీయాల ఊబినుంచి అమరావతి నేడు ఒక ‘ఫీనిక్స్’ పక్షిలా రెక్కలు విప్పుకుంటోంది. నిన్నటి దాకా అక్కడ వినిపించిన నిశ్శబ్దం… నేడు బుల్ డోజర్ల చప్పుళ్లతో, క్రేన్ల కదలికలతో కొత్త రాగాలను ఆలపిస్తోంది. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ పునరుద్ధరణ!
విధ్వంసంపై విజయం
గత ఐదేళ్లలో అమరావతిలో జరిగింది సాధారణ పాలనా వైఫల్యం కాదు, అది ఒక ‘రాజధాని వధ’. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రాంతాన్ని స్మశానంగా మార్చాలనే కుట్ర, మూడు ముక్కల ఆటలో రాష్ట్రాన్ని బలిపశువును చేయాలని చూశారు. రోడ్లను తవ్వేశారు, భవనాలను దెబ్బతీశారు, ఆఖరికి అక్కడి సామాగ్రిని కూడా దోచేశారు. ‘అమరావతిని చంపేశాం’ అని విర్రవీగిన వారికి, కాలం కఠినమైన సమాధానం చెప్పింది. నేడు అక్కడ జరుగుతున్న ‘జంగిల్ క్లియరెన్స్’ (తుప్పల తొలగింపు) పనులు, గత పాలకుల పాపాలను ప్రక్షాళన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన వెలగపూడి సచివాలయం, నేడు సందర్శకులతో, పెట్టుబడిదారులతో కళకళలాడుతోంది.
మెరిసిపోతున్న సి.ఆర్.డి.ఏ
నిన్నటి వరకు అమరావతి అంటే.. సగంలో అగిపోయిన భవనాలు, తుప్పు పట్టిన ఇనుము, ముళ్ల పొదలే గుర్తుకు వచ్చేవి. కానీ, ఈరోజు ఆ దృశ్యం మారుతోంది. ఒకప్పుడు దెయ్యాల కొంపలా. మారుతుందని ఎద్దేవా చేసిన సి.ఆర్.డి.ఏ (CRDA) ఆఫీసు, నేడు కొత్త రంగులతో, అత్యాధునిక హంగులతో ముస్తాబవుతోంది. నిన్న మొన్నటి వరకు అడవిని తలపించిన ఐఏఎస్, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎన్జీవో టవర్లు (NGO Towers) ఇప్పుడు ఫినిషింగ్ పనులతో కళకళలాడుతున్నాయి. హైకోర్టు చుట్టూ రోడ్ల నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. క్రీన్ల చప్పుళ్లు, లారీల రొదలు అమరావతి గుండె చప్పుడును. వినిపిస్తున్నాయి.
ఇది గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్ రియాలిటీ! డిసెంబర్ నాటికి కీలక భవనాలు పూర్తి చేసి, పాలనను పూర్తిగా ఇక్కడి నుంచే సాగించాలన్న ప్రభుత్వ పట్టుదల క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ బలమైన ముద్ర
అమరావతికి కేంద్రం సహకారం లేదంటూ మొన్నటి వరకు జరిగిన దుష్ప్రచారానికి.. ఇటీవల జరిగిన ఘట్టం ఒక చెంపపెట్టు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అమరావతికి వచ్చి, ఒకేసారి 15 జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన చేయడం సామాన్య విషయం కాదు. దేశ చరిత్రలోనే అపూర్వ అధ్యాయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఎల్బీసీ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ శాశ్వత భవనాలను నిర్మించుకుంటున్నాయి. ఇది అమరావతి “బ్రాండ్ ఇమేజ్’ను అమాంతం పెంచేసింది. కేంద్రం, రాష్ట్రం అనే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. రాజధాని అంటే కేవలం అసెంబ్లీ మాత్రమే కాదు, ఇదొక బలమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ అని కేంద్రం చాటిచెప్పింది.
రైతుల స్వేదం.. ఉక్కు సంకల్పం
అమరావతి పునరుజ్జీవనం వెనుక ఉన్న అసలైన హీరోలు.. అక్కడి రైతులే. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా, ప్రభుత్వ పిలుపు మేరకు 33 వేల ఎకరాలను త్యాగం చేసిన అన్నదాతలు వారు. వారిని గత ప్రభుత్వం ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని హేళన చేసింది. వారిపై అక్రమ కేసులు బనాయించింది. లారీలతో కొట్టింది. జైళ్లలో పెట్టినా వారు వెనక్కి తగ్గలేదు. 1600 రోజులకు పైగా వారు చేసిన అలుపెరగని పోరాటం, ‘న్యాయస్థానం నుండి దేవస్థానం’ వరకు సాగించిన మహా పాదయాత్రలు చరిత్ర పుటల్లో లిఖించదగినవి. న్యాయవ్యవస్థపై నమ్మకంతో వారు చేసిన అవిశ్రాంత పోరాటమే నేడు అమరావతికి ఊపిరి పోసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమరావతికి ‘రక్షణ కవచాలు’గా నిలిచాయి. ఆనాడు వారు తలవంచి ఉంటే, ఈనాడు మనకు రాజధాని ఉండేది కాదు.
ప్రపంచ బ్యాంక్ రాక.. నమ్మకానికి ప్రతీక
ఒకసారి వెనక్కి వెళ్లిపోయిన అంతర్జాతీయ సంస్థలు, మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు కానీ, అమరావతి విషయంలో అది జరిగింది. చంద్రబాబు నాయుడు విజన్ మీద, కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ప్రపంచ బ్యాంక్ మరియు ఏడీబీ (ADB) కలిసి రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి ముందుకు రావడం శుభపరిణామం. కేంద్ర బడ్జెట్లో అమరావతికి దక్కిన ప్రాధాన్యత, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన పరపతికి నిదర్శనం. నిధులు లేవని, ఇక నిర్మాణం సాధ్యం కాదని ప్రచారం చేసిన వారి నోళ్లకు ఈ పరిణామాలు తాళం వేశాయి. అమరావతి కేవలం గ్రాఫిక్స్ కాదని, గ్రౌండ్ రియాలిటీ అని ఈ నిధుల ప్రవాహమే చెబుతోంది.
విస్తరణ దిశగా… ‘ల్యాండ్ పూలింగ్’
ఒకప్పుడు రైతుల భూములు లాక్కుంటున్నారంటూ విషప్రచారం చేసిన వారికి, చంద్రబాబు తాజా ప్రకటన గట్టి సమాధానం “భవిష్యత్తు అవసరాల కోసం, పరిశ్రమల కోసం మరికొంత భూమిని సమీకరిస్తాం (Land Pooling)” అని ముఖ్యమంత్రి ప్రకటించడం.. అమరావతి విస్తరణకు నిదర్శనం. ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంగా గుర్తింపు పొందిన ‘ల్యాండ్ పూలింగ్’ విధానం మళ్లీ ఊపందుకుంది. గతంలో బెదిరిస్తే కూడా భూమి ఇవ్వని రైతులు, నేడు ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారంటే.. అది ఈ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి అసలైన గీటురాయి, విజన్-2047 లక్ష్యంగా అమరావతి సరిహద్దులు విస్తరిస్తుంటే, పెట్టుబడుల ప్రవాహానికి ఆకాశమే హద్దు కానుంది.
చట్టంతోనే శాశ్వత రక్షణ
అమరావతికి ఇప్పుడు కావాల్సింది కేవలం నిధులు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏ తుగ్లక్ నిర్ణయాలూ దీనిని తాకలేనంతటి ‘చట్టబద్ధమైన రక్షణ’: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలోనూ అదే కూటమి ఉంది. ఈ అనుకూలతను ఉపయోగించుకుని, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు లేదా చట్ట సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అస్పష్టతను తొలగించి, రాజధాని అంటే అమరావతి మాత్రమే’ అని పార్లమెంట్ సాక్షిగా ముద్ర వేయాలి. అప్పుడే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి భరోసా దొరుకుతుంది. మరోసారి రాజధాని మార్పు అనే ఊహ కూడా ఎవరికీ రాకుండా, అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కవచం తొడగాలి. ఇది భావితరాలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి.
ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు…
అమరావతిలో జరుగుతున్న శరవేగ పనులను, కేంద్ర మంత్రుల వరుస పర్యటనలను చూసి ప్రతిపక్షం (వైసీపీ) జీర్ణించు కోలేకపోతోంది. ఎక్కడ పార్లమెంట్లో చట్టం చేసి అమరావతికి శాశ్వత రక్షణ కల్పిస్తారో అని వారి వెన్నులో వణుకు మొదలైంది. “రాజధాని లేని రాష్ట్రం”గా మార్చి, రాజకీయ లబ్ది పొందాలన్న వారి కుట్రలు పటాపంచలు అవుతున్నాయన్న ఆందోళన వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి ‘చట్టబద్దత’ (Legal Sanctity) వస్తే, ఇక భవిష్యత్తులో ఎప్పటికీ దాన్ని కదిలించలేమన్న చేదు నిజం వారికి ఇప్పుడిప్పుడే అర్జనువుతోంది. అందుకే, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఎక్కడ అమరావతి శాశ్వతమైపోతుందో అని వారు గిజగిజలాడుతున్నారు.
అమరావతి గ్రోత్ ఇంజన్
సామాన్యులకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది. రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి కూర్చునే సీటు. కాదు. అది రాష్ట్రానికి సంపదను సృష్టించే గ్రోత్ 5 (Growth Engine) హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఎలా సంపదను సృష్టిస్తున్నాయో, ఏపీకి అమరావతి అలా మారబోతోంది. ఇక్కడ మౌలిక వసతులు ఏర్పడితే.. అంతర్జాతీయ కంపెనీలు వస్తాయి. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. భూముల విలువ పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంతోనే.. శ్రీకాకుళం గిరిజనుల నుండి రాయలసీమ రైతుల వరకు సంక్షేమ పథకాలు అమలు చేయగలం. అప్పులు తెచ్చి పప్పుదల్లాలు పంచడం కాదు, సంపదను సృష్టించి పంచడమే నిజమైన అభివృద్ధి. ఆ
సంపద సృష్టి కేంద్రమే అమరావతి.
ఒక కల చెదిరిపోతే మళ్లీ కనొచ్చు.. కానీ ఒక సంకల్పం దెబ్బతింటే కోలుకోవడం కష్టం. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సంకల్పాన్ని బ్యాలెట్ ద్వారా బతికించారు. అమరావతికి మళ్లీ ప్రాణం పోశారు. ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నవి కేవలం ఇటుకలు, సిమెంట్ నిర్మాణాలు కావు. అని రేపటి తరం భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాదులు, చీకటిని చీల్చుకుని వెలుగు వచ్చినట్టు, విధ్వంసాన్ని జయించి వికాసం వైపు అడుగులేస్తున్న ఈ ప్రస్థానంలో.. అమరావతి ఇక ఎప్పటికీ అగిపోని ప్రవాహం!ఇది ఆంధ్రుల కలల రాజధాని మాత్రమే కాదు.. రేపటి తరానికి సంపదను పంచే కామధేనువు!
ఎస్ పి సాహెబ్. టిడిపి అధికార ప్రతినిధి.
