మహబూబ్ నగర్హోమ్

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

#PHC

నారాయణపేట మండలంలోని కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  ప్రియాంక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళా వార్డు, ప్రయోగశాల, ఫార్మసీ, టీకాల నిల్వ గది, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఆరోగ్య కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ విధుల్లో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, సంబంధిత అధికారులను వివరణ కోరారు. నారాయణపేటలో జరుగుతున్న సమావేశానికి హాజరైనట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

మహిళా వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణితో కలెక్టర్ మాట్లాడి, ఆమె ఆరోగ్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. గర్భిణి రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన కలెక్టర్, వెంటనే అప్పక్‌పల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి, గర్భిణికి అవసరమైన టీఫా స్కానింగ్ పరీక్షలు నిర్వహించి, నివేదికను మెడికల్ ఆఫీసర్ ద్వారా తనకు పంపించాలని సూచించారు.

ఆరోగ్య కేంద్రంలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. గతంలో బయోమెడికల్ వ్యర్థాల సేకరణకు వాహనం వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని వైద్య సిబ్బంది తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు వివరించారు.

దీనిపై స్పందించిన కలెక్టర్, బయోమెడికల్ వ్యర్థాల సేకరణ వాహనం ఎందుకు రావడం లేదని డీఎంఅండ్‌హెచ్‌వోను ప్రశ్నించారు. సంబంధిత ఏజెన్సీకి వెంటనే నోటీసు జారీ చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బయోమెడికల్ వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈకి సూచించారు. వెంటనే డీఈఈను ఆరోగ్య కేంద్రానికి పంపించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన

అనంతరం కోటకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయుడు జాజాపూర్‌లో జరుగుతున్న శిక్షణకు హాజరయ్యారని, ఒక ఉపాధ్యాయుడు సెలవులో ఉండగా, మరో ఉపాధ్యాయురాలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైనట్లు ఉపాధ్యాయులు వివరించారు.

ఆరో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించి, వారి అభ్యాస సామర్థ్యాలను పరిశీలించి అభినందించారు. అనంతరం డైనింగ్ హాల్‌ను పరిశీలించి, పదో తరగతి విద్యార్థులతో భౌతిక శాస్త్రం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు.

గత విద్యా సంవత్సరంలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించే లక్ష్యంతో చదవాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రోత్సహించారు. తరగతి గదిలోని విద్యార్థులతో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో పోటీ ఉంటుందని గుర్తుంచుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను అదే రోజు పునశ్చరణ చేస్తే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు ఆర్థిక స్వావలంబన సాధించి, తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ప్రోత్సహించారు.

చివరగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వంటగది వద్ద అపరిశుభ్రతను గమనించి శుభ్రత పాటించాలని సూచించారు. ఎంపీడీవో పాఠశాలను తరచూ సందర్శించాలని ఆదేశించడంతో పాటు, వంటగదిలో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం గ్రామంలోని చేనేత కార్మికుడి ఇంటిని సందర్శించిన కలెక్టర్, అక్కడ తయారవుతున్న సిల్క్ చీరలను పరిశీలించారు. చీరల తయారీకి అవసరమైన ముడిసరుకు, ఉత్పత్తి వ్యయం, మార్కెటింగ్, విక్రయాల వివరాలను గ్రామానికి చెందిన మాస్టర్ వీవర్ పడాకుల శ్రీనివాస్ కలెక్టర్‌కు వివరించారు.

Related posts

అంతర్జాతీయ డేటా గేట్ వే గా వైజాగ్

Satyam News

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

సారీ… నో… ఇండిగో ఫ్లయిట్స్ టుడే ఆల్సో….

Satyam News

నాగర్‌కర్నూల్‌లో ఉపాధి హామీ పనులు వేగవంతం

Satyam News

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

Leave a Comment