ఆధునిక సాంకేతికతతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఈఎంఆర్సీలో కొత్తగా అభివృద్ధి చేసిన డిజిటల్ స్టూడియోను ప్రొఫెసర్ ఆచార్య కుమార్ మొలుగరం ప్రారంభించారు. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పరీక్షత్ సింగ్ మన్హాస్, యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జితెంద్ర కుమార్ త్రిపాఠి లతో కలిసి రిబ్బన్ కట్ చేశారు.
ఓయూ ఈఎంఆర్సీ నిర్వహించిన జాతీయ సదస్సు ద్వారా ఎంపికైన పరిశోధనా పత్రాలతో కూడిన పుస్తకం… “రీ ఎన్విజనింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ డిజిటల్ ఎరా… టువర్డ్స్ వికసిత్ భారత్ 2047” పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక ప్రతులను ఎంపికైన వ్యాస పరిశోధకులకు అందజేశారు. జూలై సెమిస్టర్ లో సీఈసీ – ఈఎంఆర్సీ ఓయూ అందిస్తున్న 11 స్వయం ఆన్లైన్ కోర్సుల వివరాలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. పలు పాఠ్యాంశాలను వీక్షించారు. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈఎంఆర్సీలో అందుబాటులోకి వచ్చిన నూతన స్టూడియోలో మూక్స్ కో-ఆర్డినేటర్లు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ…. డిజిటల్ విద్యారంగంలో ఉన్న అపూర్వ అవకాశాలను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
అధునాతన సాంకేతికతతో నాణ్యమైన పాఠాలు
ఓయూ ఈఎంఆర్సీ అందబాటులోకి తెచ్చిన ఆధునిక సంకేతికతను వినియోగించుకుని విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన పాఠాలను రూపొందించాలని సూచించారు. ఆన్లైన్ విద్య ప్రాధాన్యతను వివరిస్తూ… ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన 11 ఆన్లైన్ కోర్సులు డిగ్రీ (యూజీ), పీజీ విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ఈ కోర్సులపై విద్యార్థులలో, అధ్యాపకులలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా, వివిధ సబ్జెక్టులలో నిపుణులైన అధ్యాపకులు సీఈసీ (CEC) నుండి ప్రాజెక్టులను పొంది, మూక్స్ (MOOCs) కోర్సుల రూపకల్పనలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో ఉన్న అధ్యాపకుల కొరతను అధిగమించడానికి మూక్స్ కోర్సులు ఎంతగానో దోహదపడతాయని, దేశవ్యాప్తంగా ఒకే రకమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్థిరమైన విద్యను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి, డాక్టర్ కె. శ్రీరామ్ ఎడిటర్లుగా రూపొందించిన 45 పరిశోధనా పత్రాలతో కూడిన పుస్తకం అధ్యాపకులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఓయూ ఈఎంఆర్సీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని అభినందించారు. యూజీసీ, సీఈసీ నుంచి మరింత సహకారం అందించాల్సిందిగా కోరారు.
సీఈసీ, న్యూఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ పరీక్షత్ సింగ్ మన్హాస్ మాట్లాడుతూ… దేశంలోని 20 ఈఎంఆర్సీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న సెంటర్లలో ఓయూ ఒకటని ప్రశంసించారు. అవుట్ కమ్ బేస్డ్ విద్యావిధానంలో భాగంగా డిజిటల్ విద్యలో పరిశోధనలు అవసరమని…. అందుకు అనుగుణంగా ఓయూ ఈఎంఆర్సీ 45 పరిశోధనా పత్రాలతో కూడిన సమగ్ర పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావటం గర్వంగా ఉందని అన్నారు.
సీఈసీ మూక్స్ నాణ్యత విషయంలో రాజీలేకుండా పనిచేస్తున్నామని వెల్లడించారు. పరిశోధనా ప్రాజెక్టులు, మూక్స్ రూపకల్పనలో ఓయూ ఈఎంఆర్సీకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఓయూ ఈఎంఆర్సీ ద్వారా అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తామని ప్రకటించారు.
