ముఖ్యంశాలుహోమ్

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

#PavanKalyan

వైసీపీ పాలనలో అనేక ఆలయాలకు సంబంధించిన దుర్ఘటనలు చోటుచేసుకున్నాయని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన ఆయన, ఇది అత్యంత సున్నితమైన అంశమని, వాస్తవాలు చూసిన తర్వాతే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం, దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే “పోయింది పోయింది, ఇంకోటి కొందాం” అన్న తరహాలో మాట్లాడారని గుర్తు చేశారు.

అలాగే అంతర్వేదిలో రథం దగ్ధమైతే ఎవరో పిచ్చివాడు చేశాడని చెప్పడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఈ అంశాలపై తాను, సీఎం చంద్రబాబు నాయుడు చాలా అప్రమత్తంగా మాట్లాడతామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్‌డీడీబీ (NDDB) నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని, అందులో పేర్కొన్న అంశాల ఆధారంగానే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. జంతు కొవ్వు కలిసిందన్న విషయం చాలా సున్నితమైన అంశమని, అందుకే ఆలోచించి స్పందిస్తున్నామని తెలిపారు.

“మాకు ఐదేళ్లు అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే అసత్యాలు చెబుతామా?” అని ప్రశ్నించారు. కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోయామని చెప్పారు. సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాల మధ్య కక్షలు ఉంటాయని, కానీ వీళ్లు భగవంతుడిపైనే పగ పెట్టుకున్నట్టుగా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు పర్యవసానాలు కూడా ఆలోచించే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నది వాస్తవమని, ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొన్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. “అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? వాస్తవాలు చూసుకోరా?” అంటూ ప్రశ్నించారు. ఈ అంశం ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయమని అన్నారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకుండా, తిరిగి తమపైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. చివరగా పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందిస్తూ, “భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు” అని హెచ్చరించారు.

Related posts

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News

వియత్నాం పడవ ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Satyam News

హైదరాబాద్లో పలుచోట్ల వడగండ్ల వాన

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

Satyam News

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News

Leave a Comment