తన కారుపై తానే దాడి చేయించుకుని సీఐపై నింద మోపిన ఘటనలో ఒక జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 4వ తేదీన అర్ధరాత్రి సుమారు 11:40 గంటల సమయంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ 2వ లైనులోని సాయి తేజ అపార్ట్మెంట్లో నివాసం ఉండే జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు రౌడీ మూకలను నియమించుకుని, స్వంతగా తన కారుని తానే ధ్వంసం చేయించుకుని, సీఐ తన మనుషులతో దాడి చేయించారు అని పోలీస్ అధికారిపై నింద మోపి, పట్టాభిపురం పోలీస్ వారికి ఫిర్యాదు చేశాడు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశానిర్దేశంతో, వెస్ట్ డిఎస్పీ కే.అరవింద్ ఆధ్వర్యంలో సమగ్రంగా దర్యాప్తు జరిపారు. ఈ దాడి కేసులో జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు పన్నిన పన్నాగం బట్టబయలు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఈ కుట్రకు కారణమైన జర్నలిస్ట్ అరుణ్ బాబును ప్రథమ నిందితుడిగా చేర్చి, మరో 10 మందినీ నిందితులుగా గుర్తించి, వారిలో 5 మందిని గత నెల 13వ తేదీన పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటి నుండి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు, మిగిలిన నిందితుల కోసం పోలీస్ వారు ముమ్మర గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం విజయవాడలోని బస్టాండ్ వద్ద వారిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని వెస్ట్ డిఎస్పీ కె. అరవింద్ మీడియాకు తెలిపారు.
డిఎస్పీ తో పాటు పట్టాభిపురం సీఐ G.వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ ఉన్నారు. ఇప్పటి వరకు అరుణ్ బాబు మీద వేరువేరు పోలీస్ స్టేషన్లో 9 కేసులు నమోదు అయ్యాయి. ఇతను ఆంధ్ర ప్రభ, వార్త పత్రికలో పనిచేసి,వార్త ప్రపంచం అనే పత్రికలో చేరగా వాళ్ళు కూడా బయటికి పంపించే సరికి, మరల BRK News అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత రోజు BRK న్యూస్ వాళ్ళు వాట్సాప్ గ్రూపులో ఈ క్రింది విధంగా సర్క్యులేట్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు అరుణ్ కుమార్ ఇంటి పై రౌడీముకుల దాడి.
అర్ధరాత్రి ఇనుపరాడ్లు, మారణాయుధాలతో దాడి.
BRK న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ అరుణ్ కుమార్ ను హత్య చేయడానికి స్కెచ్.
గుంటూరులో పోలీసులే రౌడీలుగా మారిన వైనం.
తుళ్లూరు పోలీస్ స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు బరితెగింపు.
రౌడీ మూకలను పెంచి పోషిస్తున్న సీఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్న జర్నలిస్ట్ సంఘాలు.
జర్నలిస్టు అరుణ్ పై దాడిని తీవ్రంగా ఖండించిన తెలుగు జర్నలిస్టు ఫోరం.
“ఇప్పుడు రౌడీ మూకలను ఎవరు పోషిస్తున్నారు” ఈ సంఘటన బట్టి ఇదంతా ఎవరు చూపిస్తున్నారు చాలా క్లియర్ గా తమ దగ్గర ఆధారాలతో పాటు ఉందని పోలీసులు చెబుతున్నారు. మీడియా పేరు ఉపయోగించుకుని వారు రకరకాల దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అరుణ్ బాబు పోలీస్ ఆఫీసర్ల వద్ద నుండి, ఇంకా చాలా శాఖల అధికారుల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేశాడు. ప్రతి కేసులో యాక్షన్ తీసుకుంటామని, ఎవరైతే ఇదంతా చేయించారో వారందరి మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు.
