ఉపాధి హామీ పథకం (MGNREGS), చేయూత పింఛన్ల అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య రంగరాజన్ , జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్, దేవ సహాయం, సంబంధిత శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పనులను మరింత వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి కార్మిక కుటుంబానికి పని దినాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి, పచ్చదనం పెంపు, చెక్‌డ్యామ్‌లు, కాలువల శుభ్రత వంటి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.
కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులు ఆలస్యం కాకుండా సకాలంలో జరగేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. చేయూత పింఛన్ల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించి అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్లు సక్రమంగా, పారదర్శకంగా అందేలా జిల్లా స్థాయిలో పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా, క్రమబద్ధంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కూలీలకు తాగునీరు, నీడ, భోజన విరామం, ప్రథమ చికిత్స వంటి అవసరమైన సౌకర్యాలు పనుల ప్రదేశాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
అదేవిధంగా, ప్రతిరోజూ ఉదయం గంటలకే తాను స్వయంగా ఉపాధి హామీ పనుల ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పనుల నాణ్యత, కూలీల హాజరు, వేతనాల చెల్లింపుల పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
జిల్లా స్థాయిలో ఫీల్డ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు, పనుల పురోగతి, కూలీలకు కల్పిస్తున్న వసతుల వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు సమగ్రంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతి, చేయూత పింఛన్ల పంపిణీ పరిస్థితులపై కూడా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సమీక్షించి సంబంధిత వివరాలను వెల్లడించారు.
