చిత్తూరుహోమ్

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

#MissingCase

తిరుపతి జిల్లాలో మిస్సింగ్ కేసుగా నమోదు అయిన ఒక మహిళ గుంటూరు జిల్లాలో మృతదేహంగా కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 28న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌కు చెందిన మేనక (40) కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు తొలుత స్వయంగా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం జూన్ 6న గాజుల మండ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కనిపించకుండా పోయిన వ్యక్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే సమయంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలువ వద్ద జూన్ 8న తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ మృతి కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో మహిళను ముందుగా గొంతు నులిమి, అనంతరం బండరాయితో తలపై బలంగా మోది హత్య చేసి కాలువలో పడేసినట్లు తేలింది.

మృతదేహం వద్ద లభించిన ఆనవాళ్లు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించగా, రక్త సంబంధీకులు మృతురాలు మేనకేనని గుర్తించారు. దీంతో దుగ్గిరాల పోలీసులు గుర్తు తెలియని మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును వేగవంతం చేశారు.

దర్యాప్తులో బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతడు రేణిగుంటలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, అదే ప్రాంతంలో నివసిస్తున్న మేనకతో గత మూడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.

కొంతకాలం తర్వాత చిరంజీవి తన స్వగ్రామానికి వెళ్లి మరో వివాహం చేసుకోవడంతో మేనక అతడిని నిలదీసింది. ఈ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లగా, ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి మేనకకు రూ.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు విచారణలో వెల్లడైంది.

ఆగ్రహంతో…. గొంతు నులిమి… చంపేసి….

మే 29న గుంటూరు బస్టాండ్ సమీపంలోని ఓ వసతి గృహంలో చిరంజీవి, మేనక కలుసుకున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఇద్దరూ దుగ్గిరాల సమీపంలోని కాలువ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ డబ్బు, సంబంధాల విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన చిరంజీవి మేనక గొంతు నులిమి, అనంతరం బండరాయితో తలపై మోది హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు దర్యాప్తులో తేలింది.

సాంకేతిక ఆధారాలు, సెల్‌ఫోన్ వివరాలు, వసతి గృహంలో నమోదైన సమాచారం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మేనక సెల్‌ఫోన్‌తో పాటు వసతి గృహంలో ఉన్న లగేజ్ బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్య కేసును ఛేదించిన దుగ్గిరాల ఎస్‌ఐ వెంకటరవి, మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మంను జిల్లా ఎస్‌పీ వకుల్ జిందాల్ అభినందించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌పీ వెల్లడించారు.

Related posts

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

అమరావతిలో మరో సంచలనం….

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

ఇంకా బలంగానే ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదులు

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

Satyam News

Leave a Comment