కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా పేరొందిన చెనాబ్ రైల్వే వంతెనపై శాస్త్రవేత్త, వాతావరణ మార్పుల ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ప్రశంసలు కురిపించారు.
పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షను విరమించిన అనంతరం వైద్య చికిత్స పొందిన సోనం వాంగ్‌చుక్, ఢిల్లీ నుంచి జమ్మూ–కాశ్మీర్‌కు వందే భారత్ రైలులో ప్రయాణించి, అక్కడి నుంచి తన స్వస్థలం లడఖ్‌కు చేరుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వీడియోను పంచుకున్న ఆయన, రైలు ప్రయాణం తనకు అత్యంత ఇష్టమైన ప్రయాణ విధానమని పేర్కొన్నారు.
చెనాబ్ రైల్వే వంతెనను ప్రత్యక్షంగా చూడాలని చాలా కాలంగా అనుకున్నానని, దానిని చూసిన అనుభవం అద్భుతంగా అనిపించిందని చెప్పారు. భారతీయ రైల్వేలు సాధించిన ఇంజినీరింగ్ విజయంపై తనకు ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రశంసించిన వాంగ్‌చుక్, పరీక్షా పత్రాల లీకేజీలపై కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను కూడా స్వాగతించారు. పార్లమెంట్‌లో పరీక్షల పారదర్శకత కోసం బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమని, అయితే ఈ సంస్కరణలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా అమలు కావాలని ఆకాంక్షించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని ప్రభుత్వం, విద్యార్థి ప్రతినిధులతో జరిగిన చర్చల్లో లిఖితపూర్వక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని ప్రభుత్వం గౌరవించి, విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా యువతలో విశ్వాసాన్ని పెంపొందించే వాతావరణాన్ని సృష్టించాలని విజ్ఞప్తి చేశారు.
దేశాన్ని మరింత గొప్పదిగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, విద్యార్థులు, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో అక్రమ పద్ధతులను అరికట్టేందుకు రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను లోక్‌సభ తాజాగా వాయిస్ ఓటుతో ఆమోదించింది. ఈ చట్టం ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే సమయంలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పెల్లెట్ గన్ గాయాలకు గురైన నిరసనకారులకు సరైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
