డబుల్ ఇంజన్ సర్కారులో ట్రిపుల్ స్పీడ్‌తో రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, చెన్నై – బెంగళూరు కారిడార్లు.. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు.. మొత్తం 4 రాష్ట్రాల్లో 1671 కిలోమీటర్ల మేర నిర్మించే.. హై స్పీడ్ ట్రైన్ కారిడార్‌లో 857 కిలోమీటర్లు ఏపీ పరిధిలోకి వస్తాయి. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత సుదీర్ఘమైన హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రతిపాదనలు లేవు.
హైదరాబాద్ – చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్.. ఏపీ రాజధాని అమరావతి మీదుగా వెళ్తుంది. ఈ కారిడార్‌ని మిర్యాలగూడ మీదుగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్ ప్రతిపాదించగా.. కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట మీదుగా అలైన్‌మెంట్ రెడీ చేసింది. ఏ మార్గం ఫైనల్ అయినా రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించే ఎయిర్‌పోర్టుకి దగ్గరగా ఈ లైను వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కోసం లక్షా 90 వేల కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్ – బెంగళూరు కారిడార్‌లో 263 కిలోమీటర్ల లైను ఏపీలో నిర్మిస్తారు. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపరం పట్టణాల్లో కొత్త స్టేషన్లు వస్తాయి.
చెన్నై – బెంగళూరు మార్గం ఏపీలోని చిత్తూరు జిల్లా మీదుగా వెళ్తుంది. ఈ మార్గానికి ఇంకా ఎలైన్‌మెంట్ ఖరారు కాలేదు. రాష్ట్రంలో 90 కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైల్ కారిడార్ వస్తుంది. హైస్పీడ్ రైలు కారిడార్లు పూర్తయితే.. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు బుల్లెట్‌లా దూసుకుపోతాయి. మలుపులు, స్టాపుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొంటే.. సగటు వేగం 250 కిలోమీటర్లు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోనే చేరుకోవచ్చు. విజయవాడ, అమరావతి నుంచి తిరుపతి, చెన్నైకి రెండు గంటల్లో వెళ్లొచ్చు. చిత్తూరు నుంచి చెన్నై లేదా బెంగళూరు నగరాలకు అరగంటలోనే వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాకులతో సంబంధం లేకుండా.. హైస్పీడ్ కారిడార్ కోసం కొత్తగా ట్రాక్‌లు నిర్మిస్తారు. ఇందుకు భారీ వ్యయం అవుతుంది కాబట్టి.. వీటి నిర్మాణం పూర్తవడానికి కనీసం పదేళ్లయినా పడుతుంది.
