ముఖ్యంశాలు హోమ్

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

#Modi

ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్ తలపెట్టిన బుజ్జగింపు రాజకీయాలకు లోబడుతూ నెహ్రూ “ద్రోహం చేశారు” అని ఆరోపించారు.

వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చను ప్రారంభించిన మోదీ, 1937 అక్టోబర్ 15న లక్నో నుంచి ముస్లిం లీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నా ఈ జాతీయ గీతంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ వ్యతిరేకత నేపథ్యంలో అక్టోబర్ 20న నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేస్తూ వందే మాతరం నేపథ్యం ముస్లింలను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ వందేమాతరం గురించి 1905 డిసెంబర్ 2న దక్షిణాఫ్రికా నుంచి వెలువడే ఇండియన్ ఓపినియన్ పత్రికలో రాసిన మాటలను కూడా మోదీ ఉదహరించారు. బంకిమ్ చంద్రచట్టర్జీ రాసిన ఈ గీతం స్వదేశీ ఉద్యమంలో లక్షల మందిని ఏకం చేసిన స్పూర్తిదాయక గీతమని, అది భారతమాతను తల్లిగా భావించే భావాన్ని బలపరుస్తుందని గాంధీ అన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు.

గొప్ప గీతంపై ఎందుకు కుట్రలు చేశారు?

వందేమాతరం 1875లో రచించబడినప్పటి నుంచి అది దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసినపుడు, “అంత గొప్ప గీతంపై ఏ శక్తులు కుట్రను చేశాయి?” అని మోదీ ప్రశ్నించారు. అక్టోబర్ 29, 1937న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించి, దేవతా స్తుతులు ఉన్న తరువాతి చరణాలను తీసివేయడం ద్వారా కాంగ్రెస్ వందే మాతరాన్ని “చిన్న చిన్న ముక్కలుగా విభజించింది” అని అన్నారు.

జిన్నా వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత “నెహ్రూ తన కుర్చీ కదులుతున్నట్లు భావించారు” అని మోదీ విమర్శించారు. ముస్లిం లీగ్ ఆరోపణలను ఖండించాల్సిన చోట నెహ్రూ గీతాన్ని స్వయంగా పరిశీలిస్తూ జిన్నా అభిప్రాయాలను అనుసరించినట్లు మోదీ చెప్పారు. నెహ్రూ బోస్‌కు రాసిన లేఖలో “వందే మాతరం నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టవచ్చు” అని పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన చదివి వినిపించారు.

ఈ నిర్ణయం స్వదేశీ భావనను దెబ్బతీసిందని, కాంగ్రెస్ అప్పటి రాజకీయాల్లో ఒక వర్గం ప్రసన్నతా విధానాలకే లోబడిందని మోదీ విమర్శించారు. వందే మాతరం విభజనను అంగీకరించిన కాంగ్రెస్, తరువాత భారత విభజనను కూడా అంగీకరించాల్సిన పరిస్థితులు సృష్టించుకుందని మోదీ అన్నారు.

నాటి విధానాలే అనుసరిస్తున్న నేటి కాంగ్రెస్

నేటి కాంగ్రెస్‌ కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ దేశాన్ని విభజించే వివాదాలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా వందే మాతరం దైర్యం, ఐక్యతను అందించిందని మోదీ అన్నారు. ఆహార భద్రత సంక్షోభంలో రైతులు దేశాన్ని నిలబెట్టడం నుండి యుద్ధాల్లో సైనికులు శత్రువును ఎదుర్కొనడం వరకు, అత్యవసర పరిస్థితులను ప్రజలు జయించడం వరకు ఈ గీతం దేశానికి శక్తినిచ్చిందని వివరించారు.

వందే మాతరం కేవలం గీతం కాకుండా దేశాభివృద్ధికి ప్రేరణ అని, 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది మార్గదర్శకంగా ఉంటుందని మోదీ అన్నారు. స్వదేశీ భావనకు బలం చేకూర్చేందుకు వందే మాతరం మన మంత్రంగా ఉండాలని, దేశ హితానికి అందరు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

Related posts

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News

Leave a Comment

error: Content is protected !!