ముఖ్యంశాలు హోమ్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది, దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 సమీపంలో జరిగిన ఈ భారీ పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పేలుడు సంభవించింది. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఇది ఆత్మాహుతి దళాల ప్రమేయం అయ్యి ఉండవచ్చని, బ్లాస్ట్ ఆందోళనకరమని పేర్కొంటున్నారు. పేలుడు ధాటి 100 నుంచి 150 మీటర్ల వరకు విస్తరించిందని తెలుస్తోంది. 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉండగా, ఈరోజు సోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో సాయంత్రం 6:55 గంటలకు ఈ పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. బహుశా, రెండు భారీ పేలుళ్లు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నష్టం, సహాయక చర్యలు:

పేలుళ్ల దెబ్బకు 6 కార్లకు మంటలు వ్యాపించగా, నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించేలోపే 8 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు, సంఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్లను తరలించారు. క్షతగాత్రులను ఎల్ఎన్జెపీ (లోకనాయక్ ఆసుపత్రి)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దర్యాప్తు, భద్రత:

పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది చేరుకుని పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నారు. మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి అనుమతించడం లేదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ దగ్గరకు సీనియర్ కాప్స్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్, డీజీపీ చేరుకుంటున్నారు. చాందినీ చౌక్‌ను మూసివేసి, వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. షాప్ కీపర్స్ ను పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు పంపించి వేశాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

ఉగ్రవాద కోణం?

2011లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్ల తర్వాత దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్లీ పేలుళ్లు జరగడం ఇదే. భద్రతా సిబ్బంది ఊహిస్తున్నట్లు సీఎన్జీ పేలుడు కారణం కాదేమోనన్న అంచనాలున్నాయి. టెర్రరిస్టుల పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులతో మాట్లాడుతున్నారు, వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అమిత్ షాతో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించి, సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

అప్రమత్తమైన రాష్ట్రాలు:

ఢిల్లీ పేలుళ్లతో ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అప్రమత్తమయ్యాయి. అయోధ్యలోని రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో ఉగ్రవాద మూకలు పాగా వేసినట్లు, స్లీపర్ సెల్స్ కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ను గుర్తించిన పోలీసులు, ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాదులో పెద్ద ఎత్తున (దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్) పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు భారీ స్థాయిలో రవాణా అవుతున్న పేలుడు పదార్థాలను కూడా పోలీసులు పట్టుకున్నారు.

Related posts

మేనమామపై యుద్ధానికి వస్తున్న మేనల్లుడు

Satyam News

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News

ఐ బొమ్మ ఆగినా పైరసీ ఆగలేదు…

Satyam News

Leave a Comment

error: Content is protected !!