సంక్రాంతి మూడు రోజుల పండగ. సంక్రాంతిని సూర్యుడు ధనూ రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో జరుపుకుంటారన్నది తెలిసిందే. ఇక ‘సం’ అంటే చక్కని అని అర్థం. ‘క్రాంతి’ అంటే మార్పు అని అర్థం. అంటే చక్కని కాలంలోనికి మార్పు అని అర్ధం చేసుకోవచ్చు. చలికాలం వెళ్లి వెచ్చదనం ప్రవేశించే రోజులు వస్తాయి. అంటే ఇది రెండు కాలాల మధ్య సంధి.
ఈ సంధికాలం దానాలకు శ్రేష్టం. సంక్రాంతి నుంచి రథ సప్తమి వరకూ ఉన్న కాలం అంతా విశేష పుణ్యకాలం, సంక్రాంతి మూడు రోజుల పండగ అని తెలుసుకున్నాం. మొదటి రోజు భోగి. తిథి ప్రకారం ఇది దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు. సంక్రాంతికి ముందు రోజు వ్యవసాయదారులు పంటలను ఇళ్ళకు చేర్చి విశ్రాంతి తీసుకునే రోజు. విశ్రాంతి అవటం వల్ల భోగం అనుభవిస్తారు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చినట్లు చెబుతారు.
అంతేగాక ప్రతి పెద్ద పండగకు ముందు రోజును భోగి అనే వాడుక ఉండడం వల్లకూడా ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని అంటారు. భోగి మంటలతో ఈ పండగ రోజు మొదలవుతుంది. ఇక సంక్రాంతి రోజు వాతావరణంలో ఒక నవ చైతన్యం ప్రవేశిస్తుందని అంటారు. అందువల్ల ఈ రోజున చేసే సాధనలు విశేష ఫలితాన్నిస్తాయని అంటారు.
ఎన్నో విశేషాలు ఉన్న సంక్రాంతి పండుగ
దీపావళి మాదిరే సంక్రాంతి రోజుకు పలు విశేషాలున్నాయి. కృష్ణుడు ఇంద్రునికి గర్వభంగం చేసిన రోజు, పాతాళలోకంలో ఉండే బలి భూమి మీదకు వచ్చేందుకు విష్ణువు అనుమతించిన రోజుగా కూడా కొందరు భావిస్తారు. అలా వచ్చిన బలి భూలోకంలో పండగ వాతావరణాన్ని. సంబరాలను చూసి సంతోషించాడని పురాణ వచనం.
సంక్రాంతి రోజున స్వర్గంలో వాకిళ్లి తెరుస్తారని అందువల్ల ఆ సమయంలో దేహత్యాగం చేసినవారు నేరుగా స్వర్గానికి వెళతారని అంటారు. ఉత్తరాయన పుణ్యకాలంలో వచ్చే సంక్రాంతి పురుషుడు తనను పూజించిన వారు దక్షిణాయనంలో చేసిన పాపాలను తొలగిస్తాడని ఒకనమ్మకం. ఈ రోజున ముఖ్య విధి స్నానం.
ఈ రోజు స్నానం చేయని వారు ఏడు జన్మల వరకూ దారిద్య్ర్యం అనుభవిస్తారని అంటారు. ఈ కాలం దేవతారాధనకు ముఖ్యంగా సూర్యారాధనకు, జప పూజాదులకు పితృతేవతారాధనకు కూడా ముఖ్యమైనది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజు దానాలకు కూడా శ్రేష్టమైనది. ఈరోజున ధాన్యం, పండ్లు, విసన కర్ర, వస్త్రం, పాయసం, మజ్జిగ, కంబళ్లు, గుమ్మడికాయ, బంగారం, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరకు, గోవు, కాంస్య పాత్ర దానం చేస్తారు.
బంగారం, వెండి లేదా కంచుతో చేయించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమను దానం ఇస్తే భూమండలం దానం ఇచ్చినంత పణ్యమని కూడా కొందరు చెబుతారు. ఇక ఈ రోజున పెరుగు దానం విశేషఫలదాయకం. ద్రోణాచార్యుని భార్య, కృపాచార్యుని సోదరి కృపి ఒకసారి దుర్వాసుని సూచన మేరకు ఆయనకు పెరగు దానం చేసి ఆ పుణ్యం కారణంగా అశ్వత్థామను సుతునిగా పొందిందని ఒక కథ.
దానాలకు సనాతన ధర్మంలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. దీని వెనుక చిన్న తార్కికత క డా ఉంది ఏదైనా ఇస్తేనే మనకు వస్తుందన్నది ఆ నీతి. గ్రహ శాంతి వంటి వాటికి కూడా దానాలు చేయడం తెలిసిందే. ఇక మన ధర్మంలోని యజ్ఞాలు క డా దైవానికి ఏదో ఒకటి సమర్పించేవే. దేవతలకు మనకు ఇస్తున్న వాటన్నిటికీ కృతజ్ఞతగా ఈ అర్పణలు జరుగుతాయి.
యజ్ఞోవై విష్ణుః అనడం ద్వారా యజ్ఞాలు విష్ణు స్వరూపమని తేల్చారు. కృష్ణుడు సంక్రాంతినాడు చేశాడని చెప్పుకునే ఇంద్ర గర్వ భంగం కూడా అతనికి హవిస్సులు కాదని పర్వతానికి అర్పణ చేయడానికి సంబంధించినవే.
సంక్రాంతి పండగ మర్నాడు వచ్చే కనుమ ముఖ్యంగా పశువుల పండగ. మనదేశం ముఖ్యంగా వ్యావసాయకమైనదైనందున ఆహారాన్నందించే రైతులు ఈ సమయంలో పంటలు వచ్చి విశ్రాంతి తీసుకునే రోజు కనుక ఆట విడుపుగా తమకు పంటపనుల్లో సాయపడుతూ, పాలు, పెరుగుతో ఆహారాన్నందిస్తున్న పశువులను అలంకరించి ఊరేగిస్తారు. అయితే ఈ పండగ ప్రస్తావన అథర్వ వేదంలో ఉందని దానిని అనడుత్సవంగా పిలిచేవారని పెద్దలు చెబుతారు.
