26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

జగనన్న ఇళ్ల స్థలాల వెనుక వెయ్యి కోట్ల భూ దందా

#Jagan

వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సంచలన నివేదిక సమర్పించింది. జగనన్న కాలనీల కోసం భూములను సేకరించిన ముసుగులో వైసీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై ఏకంగా రూ.1,140.24 కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. నివాసయోగ్యం కాని స్థలాలను ఎంచుకోవడం, మార్కెట్ ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ చెల్లించి ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈ దోపిడీ సాగినట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఈ కుంభకోణంలో కింది స్థాయి నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు నెట్‌వర్క్ విస్తరించినట్లు విజిలెన్స్ గుర్తించింది. DLNS కమిటీలను అడ్డుపెట్టుకుని, ఏ మాత్రం డిమాండ్ లేని భూములను ప్రభుత్వంతో కొనిపించారు. కొన్ని జిల్లాల్లో మార్కెట్ రేటు కంటే 100 శాతం నుంచి 300 శాతం వరకు అదనపు రేట్లు నిర్ణయించి, ఆ మొత్తాన్ని బినామీల ద్వారా నేతల ఖాతాల్లోకి మళ్లించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గరిష్టంగా రూ.654 కోట్లు, విశాఖలో రూ.173 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు లెక్క తేల్చారు.

భూసేకరణ ప్రక్రియలో నిబంధనలను గాలికి వదిలేసిన పలువురు ఐఏఎస్ అధికారుల పాత్రపై విజిలెన్స్ లోతైన విచారణకు మొగ్గు చూపింది. వి.వినయ్‌చంద్, మల్లికార్జున వంటి మాజీ కలెక్టర్లతో పాటు పలువురు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోల నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. నివాసయోగ్యం కాని రాళ్లగుట్టలు, ముంపు ప్రాంతాలను సైతం నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన తీరును తప్పుబట్టిన విజిలెన్స్, దీనిపై ACB దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

వైసీపీ ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు కూడా ఈ నివేదికలో వెలుగులోకి వచ్చాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బాధితులను బెదిరించి తక్కువ ధరకు భూములు రాయించుకున్నారని, అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి రైతుల నుంచి కమిషన్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరితో పాటు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్ సన్నిహితులు, రైల్వేకోడూరు నేత ధ్వజరెడ్డి వంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ గట్టిగా సూచించింది.

విజయనగరం జిల్లా కొండకరకాంలో డీ-పట్టా భూముల సేకరణలో వైసీపీ నేతలు ఏకంగా వాటాలు పంచుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇక్కడ రైతులకు దక్కాల్సిన పరిహారంలో సర్పంచ్‌కు 30 శాతం, గ్రామ పెద్దలకు 10 శాతం చొప్పున కోతలు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నారు. ప్రకాశం జిల్లాలోనైతే మార్కెట్ రేటు 355 శాతం పెంచి మరీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో బాధ్యులైన అధికారుల నుంచి, నేతల నుంచి లూటీ చేసిన సొమ్మును రికవరీ చేయాలని విజిలెన్స్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related posts

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News

16వ సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam News

జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి

Satyam News

అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు

Satyam News

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News

భారత్ లో తగ్గుతున్న చమురు ధరలు

Satyam News

Leave a Comment