ప్రవచనాలు చెప్పే గొంతు..నిగర్విలా కనిపించే రూపం..కానీ వెనుక అడ్డగోలు భూ దోపిడీ! వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పిన విశ్రాంత IAS అధికారి అజేయ కల్లం అసలు రంగును విజిలెన్స్ విభాగం బయటపెట్టింది.
పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూసమీకరణ చేసి, చివరకు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వకుండా పెద్దలకు పందేరం చేసిన అన్నవరం స్కామ్‌లో అజేయ కల్లం ప్రధాన పాత్రధారిగా తేలారు. అత్యంత ఖరీదైన బీచ్ కారిడార్‌లో ఏకంగా 15 ప్లాట్లు, అంటే 7,922.5 చదరపు గజాల భూమిని ఆయన కారుచౌకగా నొక్కేసినట్లు విచారణలో నిగ్గుతేలింది.
భీమిలి మండలం అన్నవరం సర్వే నంబర్ 101/1లో జరిగిన ఈ భూ దోపిడీ వెనుక పక్కా ప్లాన్ కనిపిస్తోంది. ఇక్కడ బహిరంగ మార్కెట్ ధర గజానికి రూ. 20 వేల పైచిలుకు ఉండగా, అజేయ కల్లం మాత్రం కేవలం రూ. 4 వేలకే కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు.
అంటే మార్కెట్ విలువ ప్రకారం రూ. 15.84 కోట్లు చేసే ఆస్తిని, కేవలం రూ. 3.17 కోట్లు చెల్లించినట్లు చూపి కోట్లు కొల్లగొట్టారు. ఒబెరాయ్, మేఫెయిర్ వంటి స్టార్ హోటళ్లు రాబోయే ప్రాంతంలో భవిష్యత్తు ఆదాయాన్ని ముందే ఊహించి, ప్రభుత్వ పెద్దల అండతో ఈ స్కామ్ నడిపించినట్లు విజిలెన్స్ పేర్కొంది.
ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే….ఇదే భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని నమ్మించి సమీకరించారు. కానీ తీరా లేఅవుట్ వేసిన తర్వాత, అప్పటి కలెక్టర్ మల్లికార్జున ఇది పర్యాటక ప్రాంతం.. గృహ నిర్మాణానికి అనుకూలం కాదు అంటూ పేదలకు పట్టాలు ఇవ్వకుండా నిలిపివేశారు.
మరి పేదలకు అనుకూలం కాని చోట అజేయ కల్లం వంటి పెద్దలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని విజిలెన్స్ సూటిగా ప్రశ్నించింది. పేదల భూముల్లో లేఅవుట్లు వేసి, వాటిని అసైన్డ్ భూములుగా మలిచి, రైతులకు LPOCలు ఇప్పించి.. వాటిని మళ్లీ కల్లం వంటి వారు కారుచౌకగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు సహకరించారు.
ఈ కుంభకోణంలో అజేయ కల్లంతో పాటు కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతల సన్నిహితుడు ముదుమల్ల రవీంద్రారెడ్డి కూడా భారీగా లబ్ధి పొందారు. రవీంద్రారెడ్డి ఏకంగా 14,939 గజాల భూమిని చేజిక్కించుకున్నారు. 119 మంది రైతులకు స్థలాలు కేటాయిస్తే, కేవలం ముగ్గురు రైతుల దగ్గర తప్ప మిగిలిన భూమంతా ఈ పెద్దల చేతుల్లోకే వెళ్ళిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా కన్వేయన్స్ డీడ్లు కాకముందే అన్‌రిజిస్టర్డ్ బాండ్లపై MOUలు చేసుకుని 1977 POT చట్టాన్ని తుంగలో తొక్కారు.
ఈ భారీ భూ దందాలో అప్పటి కలెక్టర్లు వాడ్రేవు వినయ్ చంద్, మల్లికార్జునలతో పాటు ఆర్డీవోలు, తహసీల్దార్లు కుమ్మక్కైనట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. అక్రమంగా ఆమోదించిన అన్నవరం లేఅవుట్‌ను వెంటనే రద్దు చేయాలని, అజేయ కల్లం సహా బాధ్యులైన అధికారులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని సిఫార్సు చేసింది.
