25.2 C
Hyderabad
September 20, 2026
కరీంనగర్హోమ్

కరీంనగర్ సీపీ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీపీ తన పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వాహనాలను ప్రైవేటు వ్యక్తుల కోసం వాడుతున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా TS 09 PA 4195 నంబర్ గల ప్రభుత్వ ఇన్నోవా కారును హైదరాబాద్‌లో ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం వాడుతున్నారని, దానికి డ్రైవర్లుగా ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా నియమించారని ఆరోపించారు. అలాగే సీపీ సోదరుడిని కాలేజీలో దించేందుకు TS 09 PA 5601 నంబర్ గల మరో ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్నారని, సీపీ సతీమణి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ఎనిమిది నెలలుగా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని డీజీపీని ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణల విషయంలో కౌశిక్ రెడ్డి మరింత ఘాటుగా స్పందిస్తూ.. కరీంనగర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారి వద్ద నుంచి సీపీ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వసూళ్ల కోసం ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సృజన్ రెడ్డిలను వాడుకుంటున్నారని తెలిపారు.

జిల్లాలో 337 మంది హోంగార్డుల బదిలీల ప్రక్రియలో కోటి రూపాయల మేర చేతులు మారాయని, కేవలం డబ్బులు తెచ్చి ఇవ్వలేదన్న కారణంతో ఒక ఎస్సైను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఒక షాపింగ్ మాల్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ. 25 లక్షలు వసూలు చేశారని, తాను చెబుతున్నవి అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.

కరీంనగర్ సీపీకి నిబంధనలకు విరుద్ధంగా గన్‌మెన్లు, ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయని, ఆయన ఇంట్లో ఏకంగా 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారని ఆరోపించారు. చివరకు ఫ్యామిలీతో కలిసి హోటళ్లకు వెళ్లి భోజనం చేస్తే, ఆ బిల్లులను కూడా లోకల్ ఎస్సైలతో కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

15 రోజుల్లోగా ప్రభుత్వం సీపీపై చర్యలు తీసుకోకపోతే, ఆయనకు సంబంధించిన అన్ని అక్రమ లీలల వీడియోలను బడ్జెట్ సమావేశాల సాక్షిగా బయటపెడతానని హెచ్చరించారు. ఆ వీడియోలు చూస్తే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ తలదించుకునే పరిస్థితి వస్తుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు

.

Related posts

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి: మంత్రి ఉత్తమ్ లేఖ

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

Leave a Comment