26.3 C
Hyderabad
September 19, 2026
ఖమ్మంహోమ్

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న శ్రీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 36 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించగా, మిగిలిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

బస్సు అధిక వేగంతో ప్రయాణించడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. వేగంగా వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొట్టి రహదారిపై అడ్డంగా పడిపోయిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో మరో భారీ విషాదం తృటిలో తప్పింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం ఐదు మీటర్ల దూరంలోనే రైల్వే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండటంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు మరికొంత ముందుకు వెళ్లి విద్యుత్ లైన్లను తాకి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.

ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు, క్రేన్ సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అనంతరం వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై కూడా విచారణ కొనసాగుతోంది.

Related posts

విమానం కూలి అజిత్ పవర్ మృతి

Satyam News

ఎమ్మెల్సీ కోసం గ‌న్‌మేన్ వెతుకులాట‌

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే

Satyam News

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Satyam News

షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ

Satyam News

Leave a Comment