విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. మన దేశానికి వచ్చిన సింగిల్ లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. ఒప్పందం నుంచి ఆపరేషన్ వైపు సాగుతోంది. అయినా ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి లాభమేంటి.. అనుబంధ పరిశ్రమలు రాకపోతే ఏంటి.. అంటూ కూనిరాగాలు తీసే సన్నాయి నొక్కుల బ్యాచ్ సణుగుడు మాత్రం సద్దుమణగలేదు.
గూగుల్ డేటా సెంటర్‌లో భాగంగా ఎలాంటి నిర్మాణాలు చేస్తున్నారు.. వాటికి అనుబంధంగా ఎలాంటి పరిశ్రమలు వస్తాయి.. వీటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయో తెలుసుకొందాం.. ఒక గిగావాట్ సామర్ధ్యం కలిగిన గూగుల్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ వాస్తవానికి సింగిల్ డేటా సెంటర్ కాదు. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో నిర్మించే మూడు క్యాంపస్‌ల మెగా క్లసర్ ఇది.
ఇక్కడ వెయ్యికిపైగా సర్వర్లను ఏర్పాటు చేస్తారు. ఇవి నడవడానికి అవసరమైన విద్యుత్‌ని గూగుల్ సంస్థే సమకూర్చుకొంటుంది. ఇందుకోసం ప్రభుత్వం గూగుల్‌కి డిస్కమ్ లైసెన్స్ ఇచ్చింది. అంటే డేటా సెంటర్‌కి కావాల్సిన విద్యుత్‌ని ఆ సంస్థే పవర్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ఆదానీ గ్రీన్‌తో కలిసి సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కరెంటు సరఫరా కోసం ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మించుకొంటారు.
ఏఐ సర్వర్లను కూల్ చేయడానికి అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. వీటిని స్థానికంగానే తయారు చేస్తారు. ఎయిర్ కూలర్లు, లిక్విడ్ కూలర్ల ప్లాంట్లు ఏర్పాటవుతాయి. ఏఐ సర్వర్లలో కీలకమైన కంప్యూటర్ చిప్‌లు, జీపీయూలు మన దగ్గర తయారయ్యే అవకాశం లేకపోయినా.. వీటికి సంబంధించిన కీలకమైన కాంపొనెంట్లను స్థానికంగా తయారు చేసి.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇతర పార్టులతో ఇక్కడే అసెంబ్లింగ్ చేసే యూనిట్లు వస్తాయి.
ఇవన్నీ హార్డ్‌వేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు. డేటా సెంటర్ నిర్మాణం పూర్తయ్యాక.. సర్వర్లు, సాఫ్ట్‌వేర్.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కోసం వెయ్యి మందికి పైగా పని చేస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ యూజర్లకు డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి వందలాది గిగాబైట్ సామర్ధ్యం కలిగిన ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్స్‌ని నిర్మిస్తారు.
గూగుల్ అందిస్తున్న జెమినీ, ఇతర ఏఐ టూల్స్ ఉపయోగించుకొని కొత్త టెక్నాలజీల అభివృద్దిపై పరిశోధనలు చేసే స్టార్టప్ కంపెనీలు పెద్ద సంఖ్యలో వస్తాయి. ఏఐని ఉపయోగించి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే సంస్థలకు మిల్లీ సెకన్ సమయం కూడా కీలకమే. ఇలాంటి కంపెనీల డేటా సెంటర్లకు దగ్గర్లో ఉండటానికి ఆసక్తి చూపిస్తాయి.
మొత్తంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, పరిశోధన రంగాల్లో మొత్తంగా 2లక్షల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే వేల మంది ఉపాధి లభిస్తుంది. ఇక గూగుల్‌లాంటి టాప్ గ్లోబల్ సంస్థ వైజాగ్ వస్తే.. సిటీ బ్రాండ్‌కి భారీ బూస్టింగ్ వస్తుంది. గూగుల్ ప్రకటన తర్వాతే మెటా, రిలయన్స్, సిఫీ, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి.
సిలికాన్ వ్యాలీకి కేంద్రం.. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలకు నిలయమైన అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రం.. ఐటీలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే.. డేటా సెంటర్ల నిర్మాణంతో టెక్సస్.. అమెరికన్ ఐటీ ఇండస్ట్రీలో రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగింది. డేటా సెంటర్లతో ఉపయోగం ఏంటి.. వచ్చేదేంటి అనే ప్రశ్నకు టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో టెక్సస్ సాధించిన విజయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాని పాలకులను అడ్డగోలుగా సమర్ధించే బ్యాచ్.. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టుల గురించి సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్ల ఆయాసమంతా ప్రజల కోసమో.. వాళ్ల ప్రభువు కోసమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
