విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషన్, బొబ్బిలి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఆదివారం సందర్శించి, పోలీసు స్టేషన్, సర్కిల్ ఆఫీసు పరిసరాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ కి బొబ్బిలి సిఐ కే.నారాయణరావు, బొబ్బిలి రూరల్ సిఐ ఎస్.శ్రీనివాస్ పూల మొక్కలను అందజేసి, స్వాగతం పలికారు.
బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, యువత గంజాయి ప్రభావానికి గురికాకుండా అవగాహన కల్పించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగు, జూదం ఆడవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ ను సందర్శించి, ప్రమాద కారణాలను అన్వేషించి, రహదారి ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రతీ ద్విచక్ర వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, ప్రజలకు రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవగాహన కల్పించాలని, ఇందుకు మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
గంజాయి ప్రభావంకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇటీవల జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా గంజాయి అక్రమ రవాణ, వినియోగం, అమ్మకాలు చాలా వరకు తగ్గాయన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం పూర్తిగా నియంత్రించి, జీరో స్థాయికి తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. యువతను చైతన్యపరిచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వలన కలిగే అనర్ధాలను వివరించి, వారిలో మార్పు తీసుకొని వచ్చేందుకు గతంలో ప్రారంభించిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టి, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
అంతేకాకుండా, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని ముఖ్య కూడళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, కళాశాలలు వద్ద సంకల్పం బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణ, వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఒక కాగితంపై వ్రాసి, ఈ బాక్సుల్లో వేయాలన్నారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, గంజాయి నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా, గంజాయి గురించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే టోల్ ఫ్రీ నంబరు 1972 లేదా డయల్ 100/112కు అందించాలని కోరారు. చాలామంది యువకులు చట్ట వ్యతిరేకంగా క్రికెట్ బెట్టింగు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.
క్రికెట్ బెట్టింగు, జూదంలను తీవ్రమైన నేరంగా పరిగణించి, విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతోపాటు, యువతకు కౌన్సిలింగు నిర్వహించి, వారి మొబైల్ ఫోనులోని బెట్టింగు యాప్ లను తొలగిస్తున్నామన్నారు. బెట్టింగుల వలన ఎక్కువ మొత్తంలో డబ్బులను నష్టపోవడంతోపాటు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. కావున, బెట్టింగు, జూదం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
హైవేపై లారీలను నిలిపి వేయకుండా హైవే పెట్రోలింగు విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని, అధికారులు హైవే పెట్రోలింగు వాహనాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. హైవేపై లారీలను, ఇతర భారీ వాహనాలను నిలిపి వేయడం వలన ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. రహదారిపై వాహనాలు నిలపకుండా చూడాలని, ఆగివున్న వాహనాలు ఇతర వాహనదారులకు కనిపించే విధంగా వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లును అతికించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
అనంతరం, పోలీసు స్టేషనులో పని చేసే పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ చర్యలు చేపట్టారు. బొబ్బిలి పోలీసు గెస్ట్ హౌస్ ఆధునీకరణ పనులను జిల్లా ఎస్పీ గారు పరిశీలించి, అధికారులకు ఆధునీకరణ పనులకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు.
