ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ‘సాత్వా గ్రూప్’ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయంగా ఒక టీకప్పులో తుఫానును సాక్షి సృష్టించింది. భూ కేటాయింపులను రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ వైకాపా చేస్తున్న విమర్శలు వింటుంటే, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో జరిగిన రాజకీయ రచ్చ కళ్లముందు కదలాడుతోంది.
నాడు 1990ల చివరలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ప్రతిపాదించినప్పుడు, నేటి సాత్వా ప్రాజెక్టుపై వస్తున్న విమర్శల కంటే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అది కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే పన్నాగమని, దళిత రైతులకు చెందిన భూములను అన్యాయంగా లాక్కున్నారని ఆందోళనలు జరిగాయి.
భూములను తక్కువ ధరకు ధారాదత్తం చేశారని కోర్టుల్లో కేసులు వేశారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి కొందరు నాయకులు “ఐటీ అనేది పేదవాడికి అన్నం పెట్టదు, అది కేవలం కార్పొరేట్ షో” అని కూడా వ్యాఖ్యానించారు.కానీ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. నాడు ఆరోపణల మధ్య పుట్టిన అదే హైటెక్ సిటీ నేడు హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టింది.
లక్షలాది మంది తెలుగు యువతకు ఉద్యోగాలు ఇచ్చింది. ఆనాడు ఆరోపణలు చేసిన పార్టీలే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐటీ హబ్‌ను మరింత విస్తరించాయి. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, ఆనాడు జరిగిన రాజకీయ ఆరోపణలు కేవలం అధికారం కోసం చేసిన పోరాటమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని కాలం నిరూపించింది. ఇప్పుడు విశాఖపట్నం విషయంలోనూ అదే పునరావృతమవుతోంది.
విశాఖలో సాత్వా గ్రూప్ నిర్మిస్తున్న ‘సాత్వా వాంటేజ్ విజాగ్ క్యాంపస్’ కేవలం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది 25,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించే ఒక భారీ ఐటీ హబ్. ప్రపంచ స్థాయి గ్రేడ్-A ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తేనే టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు తరలివస్తాయి. ఒక ఐటీ కంపెనీ వస్తే దాని చుట్టూ రవాణా, హోటల్ రంగం, రిటైల్ వ్యాపారం ఇలా ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి.
సాత్వా గ్రూప్ ట్రాక్ రికార్డును గమనిస్తే, వారు గతంలో బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. బెంగళూరును సిలికాన్ వ్యాలీగా మార్చడంలో సాత్వా నాలెడ్జ్ సిటీ కీలక పాత్ర పోషించింది. ఇక హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతం ఒకప్పుడు ఖాళీగా ఉండేది, కానీ సాత్వా నాలెడ్జ్ సిటీ రాకతో నేడు అక్కడ గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు కొలువుదీరాయి.
ఈ ప్రాజెక్ట్ వల్ల రాయదుర్గం రూపురేఖలే మారిపోయి, మెట్రో కనెక్టివిటీతో గ్లోబల్ స్టాండర్డ్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. విశాఖలో కూడా మధురవాడ ప్రాంతం రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌లోని రాయదుర్గంలా మారే అవకాశం ఉంది.రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. భూ కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేయడం సరైనదే.
కానీ, ఆ విమర్శలు పెట్టుబడిదారులను భయపెట్టేలా ఉండకూడదు. హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో వచ్చిన ఆరోపణలకే భయపడి ఆనాడు ప్రభుత్వం వెనకడుగు వేసి ఉంటే, నేడు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండేది కాదు. అది తెలంగాణాను ధనిక రాష్ట్రంగా.. ఆదాయం ఇచ్చే బంగారు బాతులా మారేది కాదు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖకు ఇలాంటి ఒక భారీ ఐటీ తోడ్పాటు ఎంతో అవసరం. మన యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, సొంత ఊరిలోనే గ్లోబల్ కంపెనీల్లో పనిచేసే అవకాశం దక్కాలంటే ఇలాంటి పెట్టుబడులు రావాలి.
సాత్వా వంటి సంస్థల పెట్టుబడులు విశాఖకు ‘మంచిదా.. చెడ్డదా?’ అనే చర్చ కంటే, ఆ పెట్టుబడులను మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదే నేటి తరం యువతకు ముఖ్యం. రాజకీయ ఆరోపణలు తాత్కాలికం, కానీ ఇలాంటి ప్రాజెక్టులు సృష్టించే ఉపాధి మరియు మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శాశ్వత సంపద.
