హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు నుంచి ఉన్న ఒక మొక్క శిలాజాలను పరిశోధకులు వెలికితీశారు. కేవ్డా అనే ఈ మొక్క 24 కోట్ల ఏళ్ల నాటిదని తేల్చారు.
హిమాలయ పర్వతాలు ఏర్పడకముందే ఈ మొక్క భారత భూభాగంలో ఉనికిలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కాలక్రమేణా ఈ ప్రాచీన వృక్ష వంశం అంతరించిపోయినప్పటికీ, భారత ప్రాంతంలో మాత్రం మనుగడ సాగించినట్లు పరిశోధనలో తేలింది.
తీపి పదార్థాలకు సువాసన, రుచిని అందించడంతో పాటు సంప్రదాయ వైద్యంలోనూ ఉపయోగించే కేవ్డా మొక్కకు సంబంధించిన 24 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజ ఆకులపై జరిగిన పరిశోధన కీలక విషయాలను వెల్లడించింది.
అస్సాంలోని మకుమ్ కోల్‌ఫీల్డ్ ప్రాంతంలో లభించిన నాలుగు అత్యంత భద్రంగా సంరక్షించబడిన శిలాజ ఆకులను బిర్బల్ సహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ఆకులు సుమారు 24 మిలియన్ సంవత్సరాల నాటివిగా నిర్ధారించారు. శిలాజ ఆకులను ఆధునిక కాలంలో ఉన్న కేవ్డా జాతుల ఆకులతో పాటు హెర్బేరియాల్లో భద్రపరిచిన నమూనాలు, వృక్ష శాస్త్ర డేటాబేస్‌లలోని వివరాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో లభించిన శిలాజ ఆధారాలతో శాస్త్రవేత్తలు పోల్చారు.
ఈ విశ్లేషణలో పురాతన శిలాజ ఆకులు ప్రస్తుత కాలంలోని కేవ్డా ఆకులతో అత్యంత సారూప్యత కలిగి ఉన్నట్లు గుర్తించారు. పొడవుగా, కత్తి ఆకారంలో ఉండే ఆకులు, సమాంతరంగా విస్తరించే ఈనెలు, ఆకుల అంచుల్లో కనిపించే ప్రత్యేకమైన ముళ్లు వంటి లక్షణాలు శిలాజాల్లోనూ స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రత్యేక లక్షణాల ఆధారంగా శిలాజాలు ఆధునిక కేవ్డా మొక్కలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.
కేవ్డా మొక్క శాస్త్రీయంగా పాండనేసీ (Pandanaceae) కుటుంబానికి చెందుతుంది. ఆధునిక జాతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా లభించిన పురాతన శిలాజాలను పోల్చిన తర్వాత, ఈ వృక్ష కుటుంబానికి చెందిన ప్రాచీన వంశం మానవులు భూమిపై కనిపించడానికి కోట్ల సంవత్సరాల ముందే భారతదేశంలో స్థిరపడినట్లు పరిశోధకులు నిర్ధారించారు.
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ వృక్ష వంశం కనుమరుగైన తర్వాత కూడా భారత భూభాగం వాటికి ఆశ్రయ ప్రాంతంగా నిలిచినట్లు ఆధారాలు లభించడం. ప్రస్తుతం పాండనస్ జాతి మొక్కలు ప్రధానంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే యూరప్, ఉత్తర అమెరికాలో సుమారు 85 నుంచి 66 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజ ఆధారాలు గతంలో ఈ మొక్కల పూర్వీకులు ఉత్తర అర్ధగోళంలోని విస్తారమైన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నట్లు సూచిస్తున్నాయి.
సుమారు 34 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణం క్రమంగా చల్లబడటం ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ మొక్కలు కనుమరుగవుతూ, చివరకు ఉష్ణమండల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు అధ్యయనం పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల సమయంలో భారత ఉపఖండం పాండనేసీ కుటుంబానికి చెందిన కొన్ని ప్రాచీన వంశాలకు అనుకూలమైన ఆశ్రయంగా నిలిచినట్లు తాజా శిలాజ ఆధారాలు సూచిస్తున్నాయి.
పాలియోజీన్‌గా పిలిచే భౌగోళిక కాలం సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి 23 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. ఈ కాలంలో భారత ఉపఖండం ప్రాచీన వృక్ష వంశాల మనుగడకు ఎలా అనుకూలంగా మారిందన్న అంశంపై తాజా పరిశోధన కొత్త సమాచారాన్ని అందిస్తోంది. భారతదేశం ప్రాచీన జీవ వైవిధ్యానికి ఒక ముఖ్యమైన ఆశ్రయ ప్రాంతంగా వ్యవహరించిందనే విషయానికి ఈ శిలాజాలు మరిన్ని ఆధారాలను అందిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
వాతావరణ మార్పుల సమయంలో జీవ వైవిధ్యం ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నప్పుడు వివిధ పర్యావరణ వ్యవస్థలు, వృక్ష జాతులు ఎలా స్పందిస్తాయో అంచనా వేయడంలో ఇటువంటి ప్రాచీన శిలాజ ఆధారాలు కీలకంగా ఉంటాయని తెలిపారు. భారతదేశంలో ఇప్పటికీ కనిపిస్తున్న కేవ్డా వంటి ప్రాచీన వృక్ష వంశాల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోంది.
