“కర్తవ్యం మౌన పోరాటం, భారత్ బంద్, పీపుల్స్ ఎన్కౌంటర్, మాగారు, సీతారత్నం గారి అబ్బాయి” వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కథానాయకుడు వినోద్ కుమార్. హీరోగా ఆయనకు ఎంత మంచి పేరు ఉందో… వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది.
తన దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల తన అభిమానుల పట్ల ఆయన అపారమైన ప్రేమాభిమానాలు, ఆదరణ కనబరుస్తుంటారు. తాజాగా ఆయన చూపిన ఔదార్యం వినోద్ కుమార్ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. తాడేపల్లిగూడెంకు చెందిన సతీష్ సుమారు 20 ఏళ్లు వినోద్ కుమార్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా, పర్సనల్ టచప్ బాయ్ గా పని చేశాడు.
తదనంతర కాలంలో తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాడు. సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నడంతోపాటు తన మిత్రుడికి చెందిన ఆసుపత్రి నిర్వహించే సతీష్ తో ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లోనే ఉండే వినోద్ కుమార్ ఇటీవల “పరదేశి” అనే సినిమా షూటింగ్ నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన సతీష్ ను తన వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడడంతో పాటు.. సతీష్ ఇంటికి వెళ్లి, అతని కుటుంబ సభ్యులతో రెండు గంటలు పైగా గడిపి, వారి ఆతిధ్యం స్వీకరించి, తన గొప్ప మనసును చాటుకున్నారు. అంతేకాదు సతీష్ మాతృమూర్తి చేతిలో 20,000/- పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సతీష్. “వినోద్ కుమార్ గారి దగ్గర నేను 20 ఏళ్లు పని చేశాను. నన్ను ఎప్పుడు ఆయన ఒక వర్కర్ లా చూడలేదు. నన్ననే కాదు, ఆయన దగ్గర పని చేసే ప్రతి ఒక్కరి పట్ల ఆయన అంతే ప్రేమను చూపుతారు. కుటుంబ కారణాలవల్ల నేను తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాను.
అయినా ఆయనతో అనుబంధం అలాగే కొనసాగుతోంది. నెలకు రెండు మూడు పర్యాయాలైనా ఫోన్ చేసి యోగక్షేమాలు విచారిస్తారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ మొత్తం బట్టలు కొనుక్కోమని డబ్బులు పంపిస్తారు. రెండేళ్ల క్రితం నాకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు 50 వేలు పంపించారు. ఇప్పుడు షూటింగ్ కోసం తాడేపల్లిగూడెం వచ్చి, మా ఇంటికి రావడం…. మాతో రెండు గంటల పైగా గడపడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.
నన్ను షూటింగ్ స్పాట్ కి పిలిపించుకొని నాతో “టచప్” కూడా చేయించుకున్నారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప మనిషి దగ్గర పనిచేసినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను.. త్వరలోనే అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. నా చేతుల్లో పెరిగిన మా వినోద్ కుమార్ గారబ్బాయి… వాళ్ళ నాన్న కంటే పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నాడు!!
