తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ వైసీపీ గుప్పిట్లోనే ఉందా.. అక్కడ అధికారులంతా భూమన ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారా.. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న భక్తుల నుంచి వస్తున్న ప్రశ్నలివి. టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంపై ఏసీబీ దాడులు చేస్తే.. వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెగ బాధపడిపోతున్నారు. అధికారుల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని దెబ్బతీయడానికే.. లోకనాథంపై ఏసీబీని ప్రయోగించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీటీడీలో మా వాళ్లు 2 వేల మంది ఉన్నారని ఒక సందర్భంలో భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పుకున్నారు. టీటీడీ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నట్లుగా మాట్లాడారు. టీటీడీ అధికారుల తీరు చూస్తుంటే.. భూమన చెప్పింది నిజమేనేమో అనుకోవాల్సి వస్తోంది. వైసీపీ హయాంలో పరాకమణిలో చోరీ, పట్టువస్త్రాల కుంభకోణం వంటి అనేక అక్రమాలపై ఇప్పటి వరకు చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవోలు మారినా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మాత్రం మొదటి నుంచి టీటీడీలోనే ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులు ముందుకు సాగకుండా ఆయనే తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైసీపీ అనుకూల ఛానల్ యజమానికి ఏఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక మర్యాదలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ ఛానల్ ఓనర్‌తో రహస్య మంతనాలు జరిపారనే టాక్ వినిపించింది. ఇప్పుడు భూమన కరుణాకర్‌రెడ్డి.. వెంకయ్య చౌదరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడటంతో.. ఏఈవోకి వైసీపీ నేతలకు మధ్య సీక్రెట్ అండర్‌స్టాండింగ్ ఉందని భక్తులు, కూటమి పార్టీల నేతల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భూమన కరుణాకర్‌రెడ్డి అనేక కుట్రలకు తెరతీసిన విషయం తెలిసిందే. సగం చెక్కిన శనీశ్వరుడి విగ్రహాన్ని వివాదం చేసే ప్రయత్నం.. కొండ మీద మద్యం సీసాలతో ఆలయ పవిత్రత దెబ్బతీయాలని చూడటం వంటి అనేక కుట్రలను ప్రభుత్వం సమర్దంగా తిప్పికొట్టింది.
కానీ టీటీడీలో కీలకమైన అధికారులు.. వైసీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారనే వార్తలు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ సిగ్నల్‌గానే చూడాలి. 2019కి ముందు పింక్ డైమండ్ మాయమైందని.. వైసీపీ నేతలు చేసిన ఫేక్ ప్రచారాలు చేసి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
