మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలలో పలు చోట్ల హింసకు పాల్పడుతున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే చెల్లిన మొత్తం ఓట్లలో NDA కూటమి ఏకంగా 60.34 శాతం ఓట్లను కొల్లగొట్టి సత్తా చాటుకుంది. కానీ, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం కేవలం 34.30 శాతం ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందనడానికి ఈ ఓట్ల శాతమే నిదర్శనం.
కూటమి దూకుడు ఏ స్థాయిలో ఉందో కార్పొరేషన్ల వారీగా వచ్చిన ఫలితాలే చెబుతున్నాయి. అత్యధికంగా తిరుపతిలో కూటమి ఏకంగా 71.45 శాతం ఓట్లను సాధించి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించగా, అత్యల్పంగా అనంతపురంలో 43.65 శాతం ఓట్లను దక్కించుకుంది. మరోవైపు వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ పార్టీ అత్యధికంగా అనంతపురంలో 48.29 శాతం సాధించగా, తిరుపతిలో మాత్రం పాతాళానికి పడిపోయి కనీసం 25.10 శాతానికి మాత్రమే పరిమితమయింది.
భారీగా పడిపోయిన వైసీపీ ఓట్ షేర్
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప వంటి కీలక కార్పొరేషన్లలోనూ వైసీపీ ఓట్ షేర్ భారీగా పడిపోయింది. చాలా చోట్ల వైసీపీ ఓట్లు ముప్పై శాతం అటూఇటూగానే ఆగిపోయాయి. ముఖ్యంగా ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందడానికి, పట్టణ ప్రాంతాల్లో కూటమి పాలనపై ఉన్న సానుకూలతే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఒకప్పుడు తమకు అడ్డు లేదనుకున్న వైసీపీ ఓట్ బ్యాంక్ ఇలా ఒక్కసారిగా పడిపోవడం ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఎన్నిక ఏదైనా సరే ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారనేది ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ ఓట్ల అంతరం వైసీపీ మరింత తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
అందుకే జడ్ పి టి సీ, ఎం పి టి సి ఎన్నికలను హింసాత్మకంగా మార్చాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని చెబుతున్నారు.
పులివెందుల రాజకీయాలలో తలకిందులైన వైసీపీ ఇప్పుడు అక్కడ హింసకు పాల్పడుతున్నది. తాజాగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలింగ్ కేంద్రంలో మహిళా సిబ్బందిపై దాడికి ప్రయత్నిస్తూ, వారిని ఓటర్ల జాబితా పరిశీలించనివ్వకుండా కొందరు అడ్డుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కణంపల్లి పోలింగ్ కేంద్రంలో కొందరు వ్యక్తులు గుంపుగా లోపలికి ప్రవేశించి మహిళా సిబ్బందితో వాగ్వాదానికి దిగారని, వారి చేతులు లాగుతూ దాడికి ప్రయత్నించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన దృశ్యాలు కలకలం రేపాయి.
పోలింగ్ పై అసత్య ప్రచారం
ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇవ్వడం లేదని, తమ ఓట్లు ఇప్పటికే వేసేశారంటూ పోలింగ్ సిబ్బంది చెబుతున్నారని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో మరో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం వెనుక వైసీపీ వ్యూహం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ముందుగానే ప్రచారం చేసి, ఫలితాల అనంతరం ఎన్నికల నిర్వహణను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా, నవంబర్ 1న జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పటికీ ఓటు వేయకుండా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన రీపోలింగ్ కోరారు.
తాజా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలోనూ జగన్ చెన్నైలో వివాహ వేడుకకు వెళ్లారంటూ రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. పులివెందుల ప్రాంతంలో ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని తెలుగుదేశం వర్గాలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. ఎర్రిపల్లిలో పెట్రోల్ బాంబు దాడి ఘటనపై కూడా వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో కణంపల్లి ఘటనపై పోలీసులు, ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరు ఎలాంటి ఆటంకం లేకుండా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
