మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్, పౌర సమాజం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్’ (హెచ్సీఎస్సీ) సరికొత్త కార్యవర్గం కొలువుదీరింది.
సంస్థ పాలనను మరింత పటిష్టం చేసి, భద్రతా కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు నూతన సెక్రటరీ జనరల్‌తో పాటు వివిధ ఫోరమ్‌లకు సంయుక్త కార్యదర్శులుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను నియమించారు. కార్పొరేట్ నిర్వహణ, పట్టణ ప్రణాళిక, సైబర్ నిపుణత, మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత, పునరుత్పాదక ఇంధనం, సామాజిక సేవా రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ బాధ్యతలు అప్పగించారు.
నూతన సెక్రటరీ జనరల్ గా గౌతమ్ రెడ్డి
హెచ్సీఎస్సీ నూతన సెక్రటరీ జనరల్‌గా రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు. పర్యావరణ సేవలు, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల రంగాల్లో ఆయనకు 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. నాగార్జున వర్సిటీ, అమెరికాలోని నెవాడా విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి అయిన ఆయన సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.
వివిధ ఫోరమ్‌ల సంయుక్త కార్యదర్శులు (Joint Secretaries):
ట్రాఫిక్ ఫోరం: మహీప్ సింగ్ థాపర్ (మేనేజింగ్ డైరెక్టర్, అడెప్ట్ టెక్నాలజీస్) – పట్టణ ప్రణాళిక, మెట్రోపాలిటన్ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత నగర అభివృద్ధిలో 26 ఏళ్లకు పైగా అనుభవం కలదు.
యాంటీ నార్కోటిక్స్ (మాదకద్రవ్యాల నిరోధక) ఫోరం: డాక్టర్ కె. చంద్రశేఖర్ (మేనేజింగ్ డైరెక్టర్, ఆశా హాస్పిటల్) – ప్రముఖ న్యూరోసైకియాట్రిస్ట్, ఆశా ఆసుపత్రి వ్యవస్థాపక డైరెక్టర్. మానసిక ఆరోగ్య సేవల రంగంలో దశాబ్దాల అనుభవం గల నిపుణులు.
సీనియర్ సిటిజన్స్ ఫోరం: రవికుమార్ రాచకొండ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జెటాటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) – ప్రముఖ పారిశ్రామికవేత్త, సంస్థాగత నిర్మాణంలో అనుభవజ్ఞులు.
సైబర్ సెక్యూరిటీ ఫోరం: డాక్టర్ అనిల్ రాచమల్ల (కో-ఫౌండర్, కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్) – ఇంటర్నెట్ ఎథిక్స్, డిజిటల్ వెల్బీయింగ్, సైబర్ భద్రత అవగాహన రంగాల్లో 31 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులు.
ఫిజికల్ సేఫ్టీ ఫోరం: డాక్టర్ హర ప్రసాద్ పాండా (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, కాప్స్టన్) – కార్పొరేట్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ రంగాల్లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలదు.
సీఎస్సార్ ఫోరం: భవానీ సురేష్ (మేనేజింగ్ డైరెక్టర్, ట్రూజోన్ సోలార్) – రినహబుల్ ఎనర్జీ రంగంలో విజయవంతమైన పారిశ్రామికవేత్త, పలు రాష్ట్రాల్లో విస్తరించిన వ్యాపార అనుభవం కలదు.
ఆపరేషన్స్ విభాగం: కమాండర్ శ్రీనివాస్ రెడ్డి (హెడ్ ఆఫ్ సెక్యూరిటీ, టీసీఎస్ ఆదిభట్ల) – ఇండియన్ నేవీతో పాటు కార్పొరేట్ రంగంలో విపత్తుల నిర్వహణ, సెక్యూరిటీ విభాగాల్లో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలదు.
విమెన్ ఫోరం: ఖ్యాతి నరవణే (వైస్ ప్రెసిడెంట్, క్వాంట్రా క్వార్ట్జ్) – ఎఫ్‌టీసీసీఐ మాజీ సీఈఓగా పారిశ్రామికాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ నాయకురాలు.
ఎన్జీవోల సమన్వయకర్త : విశాల్ ఆర్య (డైరెక్టర్, ISSQUARED Inc.) – ఐటీ రంగంలో 14 ఏళ్ల అనుభవంతో పాటు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’, ప్రాజెక్ట్ పరివర్తన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
లక్ష్యాలు – కార్యాచరణ:
నూతన కార్యవర్గ నియామకం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), ప్రజల మధ్య సమన్వయం మరింత బలపడనుంది. మహిళా రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, మాదకద్రవ్యాల నిర్మూలన, భౌతిక భద్రత, వృద్ధుల సంక్షేమం వంటి కీలక అంశాలపై ఆయా విభాగాల ప్రతినిధులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు (యాక్షన్ ప్లాన్స్) రూపొందించి సమర్థవంతంగా అమలు చేయనున్నారు.
హైదరాబాద్ సీపీ, హెచ్సీఎస్సీ చైర్మన్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ గతంలో సెక్రటరీ జనరల్‌గా విశిష్ట సేవలందించిన సి. శేఖర్ రెడ్డితో పాటు, నిబద్ధతతో పనిచేసిన పూర్వ జాయింట్ సెక్రటరీలు రాజశేఖర్ రెడ్డి (ట్రాఫిక్), ప్రవీణ్ కుమార్ తంగెళ్ల (సైబర్), లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు (ఫిజికల్ సేఫ్టీ), కేజీఎస్ఎస్ శ్రీకాంత్ (యాంటీ నార్కోటిక్స్), ప్రశాంత్ కుమార్ (సీఎస్సార్)ల సేవలను కొనియాడారు.
వీరి హయాంలో అమలు చేసిన మార్గదర్శక్ (కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ ప్రోగ్రామ్), స్త్రీ సమ్మిట్ 2.0, హ్యాక్ (HACK) 2.0, ట్రాఫిక్ సమ్మిట్, స్పందన ఈవీ వాహనాలు, మహిళా హాస్టళ్లు/పీజీలలో సేఫ్టీ ఆడిట్ల కోసం చేపట్టిన సురక్షా నివాస్, స్పందన ఎలక్ట్రిక్ వాహనాలు, ట్రాఫిక్, పోలీస్ నిఘా పటిష్టత కోసం సీసీటీవీ ప్రాజెక్టులు నగర భద్రతలో మైలురాళ్లుగా నిలిచాయని ఆయన అన్నారు.
హెచ్సీఎస్సీ (HCSC) గురించి:
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది హైదరాబాద్ సిటీ పోలీస్, పౌర సమాజం మధ్య వారధిగా పనిచేసే ఒక లాభాపేక్ష లేని (Non-profit) అధికారిక సంస్థ. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజలు మరియు వ్యాపారాలు నిర్భయంగా వృద్ధి చెందేలా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
