డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వ్యక్తుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. సమ్మిట్‌కు ఆహ్వానాలు పంపిన ప్రముఖులు, వారి నుంచి వచ్చిన అంగీకారాల స్థితిగతులను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోల్లో ఒకటిగా నిలవనుందని తెలిపారు. తెలంగాణలోని విభిన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక బలాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న నూతన రంగాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలుస్తుందన్నారు.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రదర్శించడంతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడుల రంగంలో రాష్ట్ర స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమ్మిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ వ్యక్తులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ పెట్టుబడిదారులు, జాతీయ స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే సదస్సు ప్రాధాన్యత, విస్తృతి మరింత పెరుగుతాయని తెలిపారు. ప్రముఖుల భాగస్వామ్యాన్ని ఖరారు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆహ్వానితులతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ సమన్వయంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
